Telugu Global
Andhra Pradesh

బొత్సను అలా ఫిక్స్ చేశారు.. టీడీపీ వ్యూహం ఏంటి..?

విమర్శలకు బొత్స సమాధానమిచ్చారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పూర్తి పారదర్శకంగా తాను బదిలీలకు సిఫార్సులు చేశానన్నారు.

బొత్సను అలా ఫిక్స్ చేశారు.. టీడీపీ వ్యూహం ఏంటి..?
X

ప్రతీకార రాజకీయాలు చేయబోమని చెప్పిన టీడీపీ మెల్లమెల్లగా కార్యాచరణ మొదలు పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉపాధ్యాయుల బదిలీల విషయంలో టార్గెట్ చేసింది. ఎల్లో మీడియా సహకారంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగించేలా పావులు కదుపుతున్నారు టీడీపీ నేతలు.

ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. అలా కాకుండా మిగతా సందర్భాల్లో కూడా బదిలీలు జరుగుతుంటాయి. అవి మంత్రులు, అధికార పార్టీ నేతల విచక్షణ పరిధిలో ఉంటాయి. ఈ రాజకీయ బదిలీలకోసం ఏం చేయాలి..? ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి..? చేతులు కూడా తడపాలా..? అనే ప్రతిదానికీ ఓ లెక్క ఉంటుంది. ఆమధ్య ఏపీలో కూడా ఉపాధ్యాయుల బదిలీలపై విమర్శలు చెలరేగాయి. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని బదిలీలు ఆగాయి. ఇప్పుడు ప్రభుత్వం మారుతుండటంతో ఆ బదిలీలు పూర్తిగా రద్దయ్యాయి. అయితే అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

విమర్శలకు బొత్స సమాధానమిచ్చారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పూర్తి పారదర్శకంగా తాను బదిలీలకు సిఫార్సులు చేశానన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అన్నారాయన. "కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ, ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ అర్జీలు పెట్టుకున్నారు. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతే అప్పట్లో నిర్ణయం తీసుకున్నాం." అన్నారు బొత్స.

సిఫారసు బదిలీల్లో అన్నీ పారదర్శకంగా జరుగుతాయనుకోలేం, అలాగని నేరుగా మంత్రి డబ్బులు తీసుకుని బదిలీ లేఖలు ఇచ్చారని కూడా అనుకోలేం. ఇక్కడ వినిపిస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ప్రభుత్వం మారుతోంది కాబట్టి.. ఈ ఆరోపణలు మరింత బలంగా వినపడుతున్నాయి. బొత్సను టార్గెట్ చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి ఆయన ఇచ్చిన సిఫారసు లేఖలు పనికి రాకుండా పోయాయి. బదిలీ అయిపోయినట్టే అనుకున్న కొందరు ఉపాధ్యాయులు నిరాశపడ్డారు. మరి ఈ వ్యవహారానికి కొత్తగా ఏర్పడే కూటమి ప్రభుత్వం ఎలాంటి ముగింపునిస్తుందో చూడాలి.

First Published:  7 Jun 2024 11:21 AM GMT
Next Story