Telugu Global
Andhra Pradesh

ఫేస్ యాప్ కంపల్సరీ.. మంత్రి బొత్సతో టీచర్ల చర్చలు విఫలం..

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల అటెండెన్స్ విషయంలో కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

Botsa Satyanarayana
X

బొత్స సత్యనారాయణ

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల అటెండెన్స్ విషయంలో కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ యాప్ సాధ్యాసాధ్యాలపై మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. ఫేస్ యాప్ తప్పనిసరి అంటూ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఉపాధ్యాయులెవరూ ఆందోళన చెందొద్దని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ సమస్య వచ్చిందని అన్నారాయన. ఒక్కపూట ఆలస్యంగా వస్తే సెలవు పెట్టాల్సిన పనిలేదని, నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే ఆబ్సెంట్ వేస్తారనే పాత నిబంధనే ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో కొత్త నిబంధనలు పెట్టలేదని వివరణ ఇచ్చారు.

సగం మందికి ఓకే..

ఇప్పటికే సగం మంది ఉపాధ్యాయులు తమ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని అటెండెన్స్ వేశారని చెప్పారు మంత్రి బొత్స. మిగతా సగం మంది విషయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని, వాటిని సరిచేస్తామని అంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఉపాధ్యాయులకు సమయం ఇస్తున్నామని, వచ్చే నెలనుంచి అటెండెన్స్ విషయంలో ఫేస్ యాప్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై ఈ అంశంపై సమీక్షిస్తామని చెప్పారు.

అన్ని శాఖల్లో యాప్ తోనే అటెండెన్స్..

విద్యాశాఖతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఫేస్ యాప్ తో అటెండెన్స్ తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకుని వస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బంది తలెత్తుతుంది అనుకుంటే అవసరమైన మేరకు మార్పులు చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వంలో భాగమని.. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కచ్చితంగా పరిష్కరిస్తామని అన్నారు. అంతేకాని, ఆందోళనలకు దిగి రోడ్డెక్కద్దని సర్దిచెప్పారు.

మా ఫోన్లలో వద్దు..

ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ లు ఇన్ స్టాల్ చేసుకోలేమని, దీంతో తమ వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటెండెన్స్ సహా ఇతర యాప్ లకోసం తమకు ప్రత్యేక డివైస్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15రోజుల తర్వాత యాప్ పరిశీలించి అభ్యంతరాలు తెలియజేస్తామన్నారు. బోధనేతర పనులు తమకు అప్పగించొద్దని టీచర్లు కోరుతున్నారు. అధికారులు ఇబ్బందులు పెట్టడం వల్లే కొంతమంది యాప్‌ లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు.

First Published:  18 Aug 2022 6:56 PM IST
Next Story