మళ్లీ తెరపైకి క్యాసినో.. టీడీపీ, వైసీపీ సవాళ్ల పర్వం..
నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకి వైసీపీ నేతలు హాజరయ్యారని, వారంతా బ్లాక్ మనీని, వైట్ గా మార్చుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. దీంతో మరోసారి క్యాసినో వ్యవహారం రచ్చకెక్కింది.
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వైసీపీ నేతలు క్యాసినో పెట్టారని, కొడాలి నాని ఆదేశాలతోనే అది జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. సంక్రాంతి పండక్కి తాను ఊర్లో లేనని చెప్పారు నాని. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది, నిజ నిర్థారణ కమిటీ పేరుతో వెళ్లిన టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చివరకు ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ కూడా మొదలైంది. మళ్లీ ఇన్నాళ్లకు అదే క్యాసినో వ్యవహారం వార్తల్లోకెక్కింది. క్యాసినో నిర్వాహకులు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లపై ఈడీ దాడులతో రచ్చ మొదలైంది. ఈ వ్యవహారంలో సినీ తారలు, నాయకుల ప్రమేయం కూడా ఉందనే అనుమానాలున్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్‌ని మాధవరెడ్డి వాడుకోవడం కూడా సంచలనంగా మారింది. ఇక ఏపీకి వస్తే వైసీపీ నాయకులకు చీకోటి ప్రవీణ్ కి సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు.
చీకోటి ప్రవీణ్‌కి.. వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకి వైసీపీ నేతలు హాజరయ్యారని, వారంతా బ్లాక్ మనీని, వైట్ గా మార్చుకున్నారని ఆరోపించారు. దీంతో మరోసారి క్యాసినో వ్యవహారం రచ్చకెక్కినట్టయింది.
దమ్ముంటే అరెస్ట్ చేయించండి..
క్యాసినో వ్యవహారంలో మరోసారి టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. గుడివాడలో తాను క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు ఉంటే ఈడీకి చూపించి తనను అరెస్ట్ చేయించాలన్నారు. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారాన్ని తనపై, సీఎం జగన్ పై రుద్దేందుకు టీడీపీ నేతలు తెగ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందన్నారు. పలావు ప్యాకెట్లకు ఆశపడే వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి పిచ్చికుక్కల్లా మొరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
క్యాసినో నిర్వాహకుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారన్న సమాచారంతో కొంతమంది సినీ తారలు కూడా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్యాసినోలకు సినీ తారలు ప్రచారం చేసిపెట్టారు, కొందరు నేపాల్ కూడా వెళ్లి వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ వారిపై కూడా దృష్టి సారించే అవకాశముంది. నిర్వాహకులతోపాటు, అందులో పాల్గొన్నవారంతా టెన్షన్ పడుతున్నారు.