Telugu Global
Andhra Pradesh

ఎన్నికలకు టీడీపీ కార్పొరేట్ కలర్.. ఈనెల 23న వర్క్ షాప్

టీడీపీ అభ్యర్థులు ఒక్కొకరు నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని అధిష్టానం నుంచి ఆదేశాలున్నాయి. ఇప్పుడు అభ్యర్థుల్ని వారి మేనేజర్లందర్నీ వర్క్ షాప్ కి పిలుస్తున్నారు.

ఎన్నికలకు టీడీపీ కార్పొరేట్ కలర్.. ఈనెల 23న వర్క్ షాప్
X

పార్టీ వ్యవహారాలయినా, అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలయినా కార్పొరేట్ కలర్ అద్దడం చంద్రబాబుకి అలవాటు. తాజా ఎన్నికలకు కూడా ఆయన అదే తరహాలో సిద్ధమవుతున్నారు. ఈనెల 23న విజయవాడలో పార్టీ నేతలకోసం ప్రత్యేక వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు, వారి ప్రచార వ్యవహారాలు చూసే వారికి కూడా శిక్షణ ఉంటుంది.

నలుగురు మేనేజర్లు..

టీడీపీ అభ్యర్థులు ఒక్కొకరు నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని అధిష్టానం నుంచి ఆదేశాలున్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌, పొలిటికల్‌ మేనేజర్‌, మీడియా మేనేజర్‌, సోషల్‌ మీడియా మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని నిరంతరం వారినుంచి పార్టీ కార్యాలయం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని గతంలోనే చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వారందర్నీ నియమించుకున్నారు అభ్యర్థులు. ఇప్పుడు అభ్యర్థుల్ని వారి మేనేజర్లందర్నీ వర్క్ షాప్ కి పిలుస్తున్నారు. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది.

వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే గడప గడప పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి కుటుంబాన్నీ కలిశారు. వారికి అందుతున్న లబ్ధి వివరించారు. ఈ ప్రచారంలో టీడీపీ బాగా వెనకపడిందనే చెప్పాలి. ఇప్పుడు కూడా మీడియా, సోషల్ మీడియాని చంద్రబాబు ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే అభ్యర్థులందరూ మీడియా మేనేజర్లు, సోషల్ మీడియా మేనేజర్లను నియమించుకోవాలని చెబుతున్నారు. చంద్రబాబు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే, తాము జనంతో పొత్తు పెట్టుకున్నామని సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు వ్యవహారం కార్పొరేట్ స్టైల్ లోనే ఉంది. జనంలోకి వెళ్లడం, అజెండాను వివరించడం పక్కనపెట్టేశారు. ఈ పైపై మెరుగులు, మేనేజ్మెంట్ వ్యవహారాలు టీడీపీకి ఏమాత్రం ఉపయోగపడతాయో చూడాలి.

First Published:  21 March 2024 9:20 AM IST
Next Story