టీడీపీకి విజయనగరం ఎంపీ అభ్యర్థి కావలెను
విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల బరిలో దిగే అవకాశమే లేదని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. ఉత్తరాంధ్రలో పార్టీ బాగా పుంజుకుందని నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. కొన్ని స్థానాలలో టీడీపీ తరఫున పోటీచేసే అభ్యర్థులు ఎవరు అనేది తెలియక నేతలు గందరగోళంలో ఉన్నారు. అభ్యర్థులు ఎవరో తెలియక పార్టీ కేడర్ పూర్తిగా అయోమయానికి గురవుతోంది. అటువంటి నియోజకవర్గమే విజయనగరం పార్లమెంటు స్థానం. ఇటు శ్రీకాకుళం జిల్లాలో, అటు విజయనగరం జిల్లాలో మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి వున్న విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇప్పటివరకూ ఎవరూ ఆసక్తి చూపడంలేదు.
విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల బరిలో దిగే అవకాశమే లేదని తెలుస్తోంది. ఒక వేళ అశోక్ గజపతిరాజు ఆసక్తి చూపించినా కులాల సమీకరణాలు చూస్తే, టికెట్ ఇవ్వడానికి టీడీపీ ముందుకు రాదు. విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలో అతి ఎక్కువ తూర్పుకాపు ఓటర్లున్న కారణంగా తూర్పుకాపు అభ్యర్థి వైపే ఏ పార్టీ అయినా మొగ్గు చూపుతుంది.
విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు టీడీపీలో తూర్పుకాపు నేతలు ఎవ్వరూ ముందుకు రావడంలేదని సమాచారం. 2009లో టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుపై కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు, వైసీపీ అభ్యర్థి వీఎస్‌సీకేకే రంగారావుపై విజయం సాధించారు. ఇక్కడ నుంచి ప్రతీసారీ అభ్యర్థులు మారుతూ వచ్చారు. ఈ సారి కూడా టీడీపీ అభ్యర్థి మారే అవకాశాలు ఉన్నాయి. పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావుకి ఎచ్చెర్ల టికెట్ ఇవ్వకపోతే, విజయనగరం ఎంపీగా బరిలో దింపే చాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. తాను ఎంపీగా పోటీ చేయాలంటే, తన కొడుకు రామ్ మల్లిక్ నాయుడుకి ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు కావాలని కళా పట్టుబట్టే వ్యూహం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
గట్టిగా ఏడాది కూడా ఎన్నికలు లేకపోయినా, ఇప్పటికీ టీడీపీకి ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియని గందరగోళం ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఉంది. ఆర్థికంగా బలమైన ఎంపీ అభ్యర్థి దొరికితే తమకు సహాయకారిగా ఉంటాడనే ఆశతో ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. సీటు గెలిచే అవకాశాలున్నా, ఏ ఒక్కరూ ఎంపీగా బరిలో దిగేందుకు ఆసక్తి చూపకపోవడంతో తెలుగుదేశం వ్యూహకర్తలు కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం.