ప్రజావేదిక కోసం ఇంత ప్రతీకారమా..?
ఎన్నికల వేళ.. ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు ఈవీఎంని నేలకేసి కొట్టడం సంచలనం కాగా.. ఇప్పుడు నేలమట్టమవుతున్న విగ్రహాలు, శిలా ఫలకాలు, స్థూపాలు.. ఏపీ పరువుని జాతీయ స్థాయిలో బజారుకీడ్చాయి.
ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న తొలి కీలక నిర్ణయం.. కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేత. అధికార పార్టీ నేతలకు కూడా ఊహలకందని నిర్ణయం ఇది. ఐఏఎస్ లతో మీటింగ్ రోజు జగన్ ఈ ప్రకటన చేశారు, రేపు ఐపీఎస్ ల మీటింగ్ తర్వాత ఈ ప్రజావేదిక భవనం ఉండదని, ఇక్కడినుంచే అక్రమాల తొలగింపు మొదలవుతుందని ఆయన గర్వంగా ప్రకటించారు, ఆ పని చేసి చూపించారు. కాలక్రమంలో దాన్ని ప్రజలు మరచిపోవచ్చు కానీ, టీడీపీ నేతలు మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న విధ్వంసమంతా దానికి ప్రతిగానే అని చెప్పుకుంటున్నారు.
వచ్చీరాగానే విధ్వంసం..
కనీసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కూడా ఆ పార్టీ శ్రేణులు ఓపిక పట్టడంలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీలో విధ్వంసం మొదలు పెట్టారు. వైఎస్ఆర్ విగ్రహాలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ అనే పేరు కనపడితే చాలు ఊగిపోతున్నారు. జగన్ జ్ఞాపకాలు ఏవీ మిగలకూడదని పంతం పట్టారు. తాజాగా అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించిన ప్రాంతంలో నమూనా ఇంటిని ధ్వంసం చేశారు. అక్కడి స్థూపాన్ని కూడా విరగ్గొట్టారు. శిలాఫలకాన్ని జేసీబీతో నేలమట్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు కేసు నమోదు చేసుకున్నా.. అది ఎవరిపనో ఊహించడం కష్టమైన విషయం కాదు.
ఎక్కడితో ఆగుతుంది..?
ఈ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదు. సాక్షాత్తూ జగన్ గవర్నర్ కి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏపీ పోలీసులపై వైసీపీ నేతలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కినా ఉపయోగం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు.. అందరూ మౌన సాక్షులుగానే మిగిలిపోతున్నారు. దీంతో ఏపీలో జరుగుతున్న అరాచకాలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ఎన్నికల వేళ.. ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు ఈవీఎంని నేలకేసి కొట్టడం సంచలనం కాగా.. ఇప్పుడు నేలమట్టమవుతున్న విగ్రహాలు, శిలా ఫలకాలు, స్థూపాలు.. ఏపీ పరువుని జాతీయ స్థాయిలో బజారుకీడ్చాయి. ఈ ప్రతీకార జ్వాలలు మరింత పెరిగితే అదిప్రజాస్వామ్యానికే ప్రమాదం అనే హెచ్చరికలు వినపడుతున్నాయి. నాయకులకేం కాదు, కులాసాగా ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముందు పంచ్ డైలాగులు కొడతారు. దెబ్బలు తినేది, కేసులు పెట్టించుకునేది కార్యకర్తలే. బాధితులెప్పుడూ సామాన్యులే.