అమరావతిలో ఒట్టు పెట్టు.. వైసీపీ వర్సెస్ టీడీపీ
నేతలిద్దరూ ఆదివారం అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయం వద్దకు ఇరు పార్టీల కార్యకర్తలు బయల్దేరారు. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులు మోహరించారు.
ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ.. ఏపీలో నేతలు తమ ఉనికి కాపాడుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఇలాంటి సమరమే జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో పెదకూరపాడు, ఆదివారం రోజున టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. గతంలో ఎప్పుడూ ఈ నియోజకవర్గం పేరు పెద్దగా వార్తల్లోకెక్కలేదు. ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల ఫైటింగ్ సీన్ తో అమరావతిలో పోలీసులు మోహరించారు 144 సెక్షన్ పెట్టారు.
ఇసుక తవ్వకాలపై గొడవ..
పెదకూరపాడులో ఇసుక తవ్వకాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇటీవల బీజేపీ కూడా ఇక్కడ పెద్ద గొడవ చేసింది. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఆరోపణలు ఉధృతం చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. ఇసుక అక్రమాలపై వైసీపీని నిలదీశారు. దమ్ముంటే అమరావతిలోని అమరలింగేశ్వరుడి సన్నిధిలో ఒట్టుపెట్టి తమకేపాపం తెలియదని చెప్పాలంటూ ఎమ్మెల్యే శంకరరావుకి సవాల్ విసిరారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇరు వర్గాలు అమరావతిలో మోహరించాయి.
నేతలిద్దరూ ఆదివారం అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయం వద్దకు ఇరు పార్టీల కార్యకర్తలు బయల్దేరారు. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు శనివారం రాత్రే అమరావతి చేరుకున్నారు. ఆదివారం ఉదయం టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ అక్కడికి బయల్దేరగా పోలీసులు ఆయన్ను అమరావతిలోకి రాగానే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అమరావతిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.