టీడీపీ బస్సుకి పోటీగా.. వైసీపీ నుంచి 3 బస్సులు రెడీ..
టీడీపీ బస్సుపై చంద్రబాబు, భువనేశ్వరి బొమ్మలున్నాయి. ఎన్టీఆర్ కి కూడా చోటు కల్పించారు. ఇక వైసీపీ బస్సు ముందు భాగంలో ఫ్యాన్ గుర్తు ప్రముఖంగా కనపడుతుంది. మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు అంటించారు.
'నిజం గెలవాలి' అంటూ నారా భువనేశ్వరి రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఒకరోజు గ్యాప్ తో ఈనెల 26నుంచి వైసీపీ కూడా బస్సుయాత్ర మొదలు పెడుతోంది. ఈ యాత్రపేరు 'సామాజిక సాధికార యాత్ర'. వైసీపీ నుంచి మూడు బస్సులు ఈనెల 26న రోడ్డెక్కుతాయి. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి మూడు బస్సులు ఒకేసారి ప్రయాణం ప్రారంభిస్తాయి. టీడీపీ బస్సుయాత్రకు ఈ మూడు బస్సులు గట్టిపోటీ ఇవ్వబోతున్నాయి.
వాస్తవానికి నిజం గెలవాలి యాత్రకంటే ముందే సామాజిక సాధికార యాత్రకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు పాల్గొంటారని స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 3 బస్సులు, 3 బృందాలు అనేది లేటెస్ట్ అప్ డేట్. ఒకేసారి మూడు ప్రాంతాల్లో పర్యటన కొనసాగించేందుకు వీలుగా.. ఆయా ప్రాంతాల మంత్రులకు ప్రయారిటీ ఇవ్వడం కోసం యాత్రను ఇలా ప్లాన్ చేశారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఏపీలో ఈ యాత్ర కొనసాగుతుంది.
టీడీపీ బస్సుపై చంద్రబాబు, భువనేశ్వరి బొమ్మలున్నాయి. ఎన్టీఆర్ కి కూడా చోటు కల్పించారు. ఇక వైసీపీ బస్సు ముందు భాగంలో ఫ్యాన్ గుర్తు ప్రముఖంగా కనపడుతుంది. మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు అంటించారు. జగన్ ఫొటోతోపాటు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని ప్రమఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఈనెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలనుంచి బయలుదేరుతాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్రలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు ప్రజలకు వివరిస్తారు. ప్రతి రోజు రెండుచోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తమ్మీద ఏపీలో కాస్త ముందుగానే ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పాలి.