Telugu Global
Andhra Pradesh

అమరావతి వాంగ్మూలాలను టీడీపీ కొట్టేసిందా?

దళితులు, బీసీల నుంచి 964 ఎకరాల అసైన్డ్ భూములను మోసపూరితంగా టీడీపీ నేతలు కాజేశారని పలువురు బాధితులు, అధికారులు సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. అయితే తామిచ్చిన వాంగ్మూలాలు టీడీపీ నేతల చేతికి ఎలా వెళ్లాయని సాక్షులు ఆందోళన చెందుతున్నారు.

అమరావతి వాంగ్మూలాలను టీడీపీ కొట్టేసిందా?
X

అమరావతి కుంభకోణంలో సాక్షులు, కీలక అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు టీడీపీ పెద్దలకు చేరిపోయాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ మీడియాలోనే ఈ అంశంపై కథనాలు వస్తున్నాయి. దళితులు, బీసీల నుంచి 964 ఎకరాల అసైన్డ్ భూములను మోసపూరితంగా టీడీపీ నేతలు కాజేశారన్న కుంభకోణంలో... పలువురు బాధితులు, అధికారులు సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. అమ్మకాలు జరిగినా సరే అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని తాము చెప్పినా నాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లెక్క చేయలేదంటూ ఉన్నతాధికారులు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

ఈ వాంగ్మూలాలకు సంబంధించిన పత్రాలను అడ్డదారుల్లో టీడీపీ వారు సంపాదించారని.. వాటి ఆధారంగా సాక్షులను బెదిరిస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. మనమంతా ఒకటే అంటూ రకరకాల మార్గాల్లో సాక్షులను దారికి తెచ్చుకునేందుకు రాయబారాలు, మాట వినని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అసలు తామిచ్చిన వాంగ్మూలాలు టీడీపీ నేతల చేతికి ఎలా వెళ్లాయని సాక్షులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వాంగ్మూలాలకు సంబంధించిన కాపీలు ఎవరి ద్వారా లీక్ అయ్యాయి అన్న దానిపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు.

First Published:  12 Nov 2022 4:06 PM IST
Next Story