Telugu Global
Andhra Pradesh

టార్గెట్ కొడాలి నాని.. ఫ్లెక్సీలతో రెచ్చగొడుతున్న టీడీపీ

గతంలో వైసీపీ నేతలు విసిరిన సవాళ్లను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు టీడీపీ నేతలు. అది చాలదన్నట్టు ఇప్పుడు పబ్లిక్ గా ఫ్లెక్సీలు వేయడంతో కలకలం రేగింది.

టార్గెట్ కొడాలి నాని.. ఫ్లెక్సీలతో రెచ్చగొడుతున్న టీడీపీ
X

ఇప్పటికే రెడ్ బుక్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అది చాలదన్నట్టు టీడీపీ మరింతగా వైసీపీ నేతల్ని రెచ్చగొడుతోంది. రెచ్చగొట్టే ఫ్లెక్సీలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా గుంటూరులో కొడాలి నాని ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. చంద్రబాబు కాళ్లదగ్గర కొడాలి కూర్చున్నట్టుగా ఉన్న ఫ్లెక్సీలను గుంటూరులో ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పేరుతో వెలసిన ఈ ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి.

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను ఆయన కాళ్లదగ్గర పడి ఉంటానని గతంలో కొడాలి నాని ఓ సందర్భంలో సవాల్ విసిరారు. ఎన్నికల తర్వాత ఆ సవాల్ ప్రకారం నాని ఆ పని చేయలేదని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా టీడీపీ పోస్టింగ్ లు పెడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీ రాజకీయాలకు తెరతీశారు. ఇక తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన సవాల్ ని టీడీపీ నేతలెవరూ స్వీకరించలేదని అందుకే దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకంటే జనసేన అభ్యర్థికి ఒక్క ఓటు ఎక్కువొచ్చినా తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా గతంలో సవాల్ చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సవాళ్లను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నా.. కొడాలి నాని గురించి పబ్లిక్ గా ఫ్లెక్సీ వేయడంతో కలకలం రేగింది.

మాజీ మంత్రి రోజా ఇంటిముందు..

నగరిలో మాజీ మంత్రి రోజా ఇంటి ముందు పవన్ కల్యాణ్ కి చెందిన భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అభిమానులు. రోజాని రెచ్చగొట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వేరే చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా రచ్చ సరిపోలేదన్నట్టుగా ఇప్పుడు నేరుగా ఫ్లెక్సీలు హోర్డింగ్ లతో రెచ్చగొడుతున్నారు టీడీపీ నేతలు.

First Published:  16 Jun 2024 9:41 AM GMT
Next Story