వాలంటీర్ల రగడపై టీడీపీ సైలెన్స్.. ఎందుకంటే..?
వాలంటీర్లపై పవన్ కల్యాణ్ విమర్శలపై మీ స్టాండ్ ఏంటి.. అనే ప్రశ్నను కూడా తన దగ్గరకు రానీయడంలేదు నారా లోకేష్.
ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, వాలంటీర్ల నిరసనలు, మంత్రులు, ఎమ్మెల్యేల చీవాట్లు, మహిళా కమిషన్ నోటీసులు, అయినా వెనక్కి తగ్గని జనసేనాని.. ఇలా ఉంది ఈ వ్యవహారం. వైసీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే ఈ యుద్ధంలోకి టీడీపీ ఎంట్రీ ఇవ్వకపోవడమే ఇక్కడ విశేషం.
టీడీపీ స్టాండ్ ఏంటి..?
వ్యూహాత్మకంగా అన్నారో, లేక నోరు జారారో తెలియదు కానీ పవన్ కల్యాణ్, వాలంటీర్లపై పెద్ద నిందవేశారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా ఆయన మాత్రం సారీ చెప్పలేదు సరికదా మరింత రెట్టిస్తూ నిందలు వేస్తున్నారు. అందర్నీ కాదు, కొందర్నే అంటూ కవర్ చేసుకోవడం మొదలు పెట్టారు. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో వాలంటీర్లలో కొంతమంది అయినా పవన్ కి వ్యతిరేకమయ్యారనే మాట వాస్తవం. ఈ దశలో పవన్ కి సపోర్ట్ చేసినా, వాలంటీర్ వ్యవస్థను విమర్శించినా అది మొదటికే మోసం వస్తుందని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు కానీ, యువగళం యాత్రలో ఉన్న లోకేష్ గానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు.
వాలంటీర్లపై పవన్ కల్యాణ్ విమర్శలపై మీ స్టాండ్ ఏంటి.. అనే ప్రశ్నను కూడా తమ దగ్గరకు రానీయడంలేదు నారా లోకేష్. యువగళం యాత్రలో ఆయన సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్నా పట్టించుకోవడంలేదు.
టీడీపీ వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ కి దూరంగా ఉంది. పవన్ కి సపోర్ట్ చేస్తే లేనిపోని తలనొప్పులు కొనితెచ్చుకోవడం ఖాయం. అందుకే పవన్ పై రాళ్లు పడుతున్నా టీడీపీ సైలెంట్ గా చూస్తోంది, టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ వ్యవహారంలో పెద్దగా తలదూర్చడంలేదు. వాలంటీర్ల నిరసనలు కూడా కవర్ చేస్తూ న్యూట్రల్ గా ఉండటానికి ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద పవన్ మాత్రం అడ్డంగా బుక్కాయ్యారని తెలుస్తోంది. పైగా కేంద్ర నిఘా వర్గాల సమాచారం అంటూ ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ మరింత గందరగోళానికి దారితీసింది.