ఏపీ క్యాబినెట్‌లో చోటు కోసం సీనియర్లు, జూనియర్ల పోటాపోటీ
మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ఐదారు స్థానాలు పోతే మిగిలినవాటిలో తమకే అవకాశమని సీనియర్లు సంబరపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడి నుంచి అనంతపురంలో పయ్యావుల కేశవ్ వరకు సీనియర్లంతా క్యాబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నారు.
ఏపీలో కూటమి గెలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకో ఆరేడు రోజుల సమయం ఉంది. ఓట్లు, మెజారిటీల లెక్కల ముగిసి ఇప్పడు చర్చంతా మంత్రి వర్గ కూర్పుపైకి మళ్లింది. కూటమిలో పార్టీలన్నీ క్యాబినెట్‌లో ఉంటాయా? జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోకి రాబోతున్నారా? వస్తే ఏ పదవి ఇస్తారు ఇలాంటి చర్చోపచర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు పొరుగునున్న తెలంగాణలో సామాన్యుల మధ్య కూడా నడుస్తున్నాయి.
పాతకాపులతో కొత్తతరం పోటీ
ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు క్యాబినెట్‌లో చోటు కోసం రేసు రసవత్తరంగా మారబోతోంది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ఐదారు స్థానాలు పోతే మిగిలినవాటిలో తమకే అవకాశమని సీనియర్లు సంబరపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడి నుంచి అనంతపురంలో పయ్యావుల కేశవ్ వరకు సీనియర్లంతా క్యాబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నారు. తొలిసారి గెలిచిన యువతరం వారికి పోటీ ఇస్తోంది. చంద్రబాబు, లోకేష్ కొత్తతరానికి అవకాశం ఇస్తామన్నారని గుర్తుచేస్తున్నారు.
లిస్ట్ పెద్దదే
శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరంలో కళా వెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, బేబినాయన, విశాఖలో అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరిలో బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, పశ్చిమ గోదావరిలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణరాజు, కృష్ణాలో కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, బోండా ఉమ, కొలుసు పార్థసారథి, శ్రీరాం తాతయ్య, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రకాశంలో గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డీబీవీ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, రామనారాయణరెడ్డి ఇలా కోస్తా జిల్లాల వరకే చూసినా ఆశావహులైన సీనియర్ల జాబితా చాంతాడంత ఉంది.
రాయలసీమ మాటేంటి?
గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలిచిన రాయలసీమలో ఈసారి టీడీపీ కూటమి దున్నేసింది. 46 మంది ఎమ్మెల్యేల్లో 40కిపైగా టీడీపీ వారే. పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బీకే పార్థసారథి, పుట్టా సుధాకర్‌యాదవ్ ఇలా సీనియర్ నేతలంతా క్యాబినెట్‌లో చోటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.