రైతు ఆత్మహత్యలపై టీడీపీ సెల్ఫ్‌గోల్
2021 గణాంకాల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్నాటక తర్వాత మూడో స్థానంలో ఏపీ ఉంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది.
ఏపీ, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. 2019లో 628 మంది రైతులు ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సంఖ్య 2020 నాటికి 564కు తగ్గింది. 2021లో 481 మంది రైతులు ఏపీలో ఆత్మహత్యలు తీసుకున్నారు.
2019లో తెలంగాణ వ్యాప్తంగా 491 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. 2021లో ఆ సంఖ్య 352కు తగ్గింది. దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే జరుగుతున్నాయి. 2021లో మహారాష్ట్రలో మొత్తం 2,640 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నాటకలోనూ ఎక్కువగా రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2021లో కర్నాటక వ్యాప్తంగా 1,170 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
2021 గణాంకాల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్నాటక తర్వాత మూడో స్థానంలో ఏపీ ఉంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రైతుల ఆత్మహత్యల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి టీడీపీ ఎంపీ ఈ ప్రశ్న వేశారన్నారు. అయితే ఏపీలో ఆత్మహత్యలు తగ్గాయంటూ కేంద్రం ఇచ్చిన సమాధానంతో టీడీపీనే ఇరుకునపడిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 2019తో పోలిస్తే ఏపీలో 25 శాతం ఆత్మహత్యలు తగ్గాయన్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగానే ఆత్మహత్యలు తగ్గాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.