Telugu Global
Andhra Pradesh

మీ పాపం పండింది..! రెచ్చగొడుతున్న టీడీపీ

వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగినట్టు వీడియోలతో సహా ఆధారాలున్నా.. టీడీపీ వాటి గురించి మాట్లాడటంలేదు. పైగా రెడ్ బుక్ లో పేర్లున్నాయని, గట్టిగా బుద్ధి చెబుతామంటూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విశేషం.

మీ పాపం పండింది..! రెచ్చగొడుతున్న టీడీపీ
X

ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై వైసీపీ కంఠశోష మినహా టీడీపీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. వైసీపీ శ్రేణులు రెచ్చగొడతాయి జాగ్రత్త అంటూ చంద్రబాబు హితవు పలికారు కానీ, టీడీపీ వాళ్లు కాస్త సంయమనం పాటించండని కూడా ఆయన సలహా ఇవ్వలేదు. తాజాగా టీడీపీ తరపున ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. గతంలో సీఐడీ కేసుల్లో పట్టాభి కూడా బాధితుడే కావడం గమనార్హం. చట్టానికి లోబడే వైసీపీ వాళ్లకు గట్టిగా బుద్ధి చెబుతామన్నారాయన.


రెడ్ బుక్ ప్రస్తావన..

రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగలేదని, హింసను టీడీపీ ప్రేరేపించదని చెప్పారు పట్టాభి. నారా లోకేష్ రెడ్‌ బుక్‌ అనేది వాస్తవం అని తేల్చి చెప్పారు. రెడ్‌బుక్‌లో పిల్ల సైకోలు, అవినీతి అధికారుల పేర్లు నమోదయ్యాయని, వారి సంగతి చూస్తామన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు ఎన్నో పాపాలు చేశారని, దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. అప్పుడు వారికి ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. దాడులు చేసి, పైగా భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ వైసీపీ నేతలు కలరింగ్ ఇచ్చేవారని, మావాళ్లకు బీపీలు రావా అంటూ.. సాక్షాత్తూ అప్పటి సీఎం జగన్ చెప్పేవారని అన్నారు పట్టాభి. ఐపీసీ సెక్షన్ల పవరేంటో ఇప్పుడు తాము చూపిస్తామన్నారు.

గతంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడినప్పుడు వారికి ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు పట్టాభి. యువగళం పాదయాత్రపై 22 సార్లు రాళ్లదాడులు జరిగాయన్నారు. అమరావతి రైతులపైనా దాడి చేశారన్నారు. అప్పుడు తమపై దాడులు చేసి, ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టాభి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగినట్టు వీడియోలతో సహా ఆధారాలున్నా.. టీడీపీ వాటి గురించి మాట్లాడటంలేదు. పైగా రెడ్ బుక్ లో పేర్లున్నాయని, గట్టిగా బుద్ధి చెబుతామంటూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విశేషం.

First Published:  10 Jun 2024 1:54 PM IST
Next Story