ఈ ఫలితాలు ఊహించలేదు - చంద్రబాబు
పాలకులుగా కాకుండా సేవకులుగా పని చేస్తామన్నారు. ప్రజలు గెలవాలి.. ప్రజాస్వామ్యం నిలబడాలన్నదే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు.
కూటమి విజయం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఫలితాలను తానూ ఊహించలేదన్నారు. ఇలాంటి ఎన్నికలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా పట్టుదలతో వచ్చి ఓటు వేశారని చెప్పారు చంద్రబాబు. కార్యకర్తల త్యాగల ఫలితమే ఈ విజయమని అభివర్ణించారు చంద్రబాబు.
పవన్‌కల్యాణ్ కారణంగానే పొత్తు సాధ్యమైందన్నారు. పాలకులుగా కాకుండా సేవకులుగా పని చేస్తామన్నారు. ప్రజలు గెలవాలి.. ప్రజాస్వామ్యం నిలబడాలన్నదే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు. రాజకీయాల్లో నాయకులెవరూ శాశ్వతం కాదన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం శాశ్వతమన్నారు.
ఇక జగన్ పాలనపైనా మండిపడ్డారు చంద్రబాబు. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని ఇబ్బంది పడ్డాయన్నారు. ఐదేళ్లుగా తెలుగుదేశం కార్యకర్తలు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు చంద్రబాబు. ప్రజాస్వామ్యం తలదించుకునే ఘటనలు జరిగాయన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కులు ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే ప్రజలు ఆదిరిస్తారన్నారు చంద్రబాబు.