Telugu Global
Andhra Pradesh

వారాహికి టీడీపీ మద్దతు.. అక్టోబర్ 2న భువనేశ్వరి నిరాహార దీక్ష

చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా అక్టోబర్‌ 2న ఆయన సతీమణి భువనేశ్వరి నిరాహార దీక్ష చేపడతారని టీడీపీ నేతలు తెలిపారు. అక్టోబర్‌ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు కూడా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వారాహికి టీడీపీ మద్దతు.. అక్టోబర్ 2న భువనేశ్వరి నిరాహార దీక్ష
X

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత రేపటి నుంచి మొదలవుతుంది. అవనిగడ్డ సభతో ఆయన జనంలోకి వస్తారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ వారాహి ఎక్కడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఆయన యాత్ర ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ఈ యాత్రకు టీడీపీ బహిరంగ మద్దతు తెలిపింది. తమ పార్టీ తరపున వారాహికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు బాలకృష్ణ. టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

లోకేష్ జూమ్ మీటింగ్..

ఢిల్లీలో ఏం చేస్తున్నారో తెలియదు కానీ రోజుకోసారి ఏపీ టీడీపీ నేతలతో లోకేష్ జూమ్ ద్వారా మీటింగ్ లు పెడుతున్నారు. తాజాగా ఆయన టీడీపీ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం కాగా, ఢిల్లీ నుంచి వర్చువల్‍ గా ఆ సమావేశంలో పాల్గొన్నారు లోకేష్. భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు.

భువనేశ్వరి నిరాహార దీక్ష

పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న బాలకృష్ణ.. చంద్రబాబు త్వరలో స్కిల్ కేసు నుంచి బయటపడతారని ఆకాంక్షించారు. చంద్రబాబుపై కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమేనన్నారు. కేసులకు తాము భయపడేది లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని చనిపోయిన 97 మందికి ఈ సమావేశంలో నాయకులు సంతాపం తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతామని అన్నారు. జనసేన - టీడీపీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీ క్షేత్ర స్థాయిలో పోరాటాలతో సిద్ధమవుతుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా అక్టోబర్‌ 2న ఆయన సతీమణి భువనేశ్వరి నిరాహార దీక్ష చేపడతారని టీడీపీ నేతలు తెలిపారు. అక్టోబర్‌ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు కూడా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

First Published:  30 Sept 2023 3:13 PM IST
Next Story