Telugu Global
Andhra Pradesh

తమ్ముళ్ళకు షాకిచ్చిన కేశినేని

కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగానే ఎమ్మెల్యే పనితీరును కేశినేని అభినందించారు. దాంతో నందిగామలోని తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో పాటు విజయవాడలోని నేతలకు కూడా మండిపోతోంది.

తమ్ముళ్ళకు షాకిచ్చిన కేశినేని
X

విజయవాడ తెలుగుదేశంపార్టీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం పార్టీలో ఎవరికీ అర్థంకాదు. ఏరోజు ఏమిమాట్లాడుతారో కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఒళ్ళుమండితే చంద్రబాబు నాయుడును కూడా తీసేపారేసినట్లు మొహంమీదే మాట్లాడేస్తుంటారు. దాంతో ఎంపీ ఎక్కడ ఏమి మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. పార్టీలో ప్రత్యర్థులు కూడా చాలా ఎక్కువమందే ఉన్నకారణంగా ఎంపీ మాట్లాడే ప్రతిమాట మంటలు రాజేస్తోంది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు బాగా పనిచేస్తున్నట్లు ఎంపీ అభినందించారు.

ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలుచేయిస్తు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా జోరుమీద పూర్తిచేయిస్తున్నట్లు చెప్పారు. దాంతో మిగిలిన తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు కేశినేనిపైన ఓ రేంజిలో మండుతోంది. జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో నందిగామ కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎంపీని ఎమ్మెల్యే ఆహ్వానించారు.

కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగానే ఎమ్మెల్యే పనితీరును కేశినేని అభినందించారు. దాంతో నందిగామలోని తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో పాటు విజయవాడలోని నేతలకు కూడా మండిపోతోంది. ఒకవైపు ఎమ్మెల్యే నాయకత్వంలో అభివృద్ధి జరగటంలేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు నానా గోలచేస్తున్నారు. ఈ సమయంలోనే నందిగామలో సంక్షేమ, అభివృద్ధిపనులు బాగా జరుగుతున్నాయని ఎంపీ చెప్పటం ఏమిటంటూ అందరూ మండిపోతున్నారు. ఎమ్మెల్యేని అభినందించటమే కాకుండా మొండితోకతో కలిసి ఎంపీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటంపై రెచ్చిపోతున్నారు.

తమపార్టీ ఎంపీనే వైసీపీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నట్లు అభినందిస్తే ఇక తాము ప్రభుత్వంపైన, ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఎలా పోరాడగలమని చంద్రబాబునాయుడుతో మొరపెట్టుకుంటున్నారు. నందిగామలోనే కాదు విజయవాడ పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించిన‌ప్పుడు కూడా ఎంపీ పార్టీని ఇరుకునపెట్టేట్లుగా మాట్లాడుతున్నారంటు తమ్ముళ్ళు మండిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెల్యేగా పోటీచేయటానికి కేశినేని ప్రయత్నిస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. ఇదే విషయమై కేశినేని మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు అభివృద్ధిపైన దృష్టిపెడితే అన్నీ నియోజకవర్గాలు చక్కగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

First Published:  22 May 2023 10:44 AM IST
Next Story