కేశినేని బ్రదర్స్ ట్రావెల్స్ సెప`రూటు`
ఆర్థికంగా అన్న నాని కంటే తమ్ముడు చిన్నియే బెటరని తెలుగుదేశంలో ఓ స్థాయి నేతల మధ్య చర్చ నడుస్తోంది. అయితే అధిష్టానం ఆలోచన విభిన్నంగా ఉందట.
తెలుగు రాష్ట్రాల్లో కేశినేని ట్రావెల్స్ చాలా ఫేమస్. రాజకీయ నాయకుడిగా కేశినేని ట్రావెల్స్ యజమాని, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా చాలా ఫేమస్. ఆరోపణలు వచ్చాయని ట్రావెల్స్‌నే మూసేసిన ధీశాలి నాని. ట్రావెల్స్ మూసేసినా, పొలిటికల్ ట్రావెల్ కొనసాగిస్తున్న కేశినేని బ్రదర్స్ సెప`రూటు` పట్టారని తెలుస్తోంది.
రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలున్నా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. రాష్ట్రం నడిమధ్యలో ఉండటం ఒక్కటే కారణం కాదు. విద్య, విజ్ఞాన, రాజకీయ చైతన్యంలో పేరెన్నికగన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ రాజకీయాలు చేయగలిగిన వాళ్లు ఎక్కడైనా నెగ్గుకురాగలరు అని పొలిటికల్ సర్కిళ్లలో టాక్.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మళ్లీ పోటీ చేస్తారా? ఆయన తమ్ముడిని రంగంలోకి దింపుతారా అనే డైలమా పార్టీలో కొనసాగుతోంది. అధిష్టానంతో విజయవాడ ఎంపీ నానికి బాగా గ్యాప్ పెరిగిపోయింది. ఈ గ్యాప్‌లో సొంత తమ్ముడు కేశినేని చిన్ని ఎంటర్ కావడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుంది పరిస్థితి. తనకి సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతానని నాని ప్రకటించారు.
ఆర్థికంగా అన్న నాని కంటే తమ్ముడు చిన్నియే బెటరని తెలుగుదేశంలో ఓ స్థాయి నేతల మధ్య చర్చ నడుస్తోంది. అయితే అధిష్టానం ఆలోచన విభిన్నంగా ఉందట. ఎంత అహంకారంగా ఉన్నా నానిది బోళాశంకరుడి మనస్తత్వం అని.. ఆయనని సముదాయించి ఎన్నికల క్షేత్రంలోకి దింపితే తన ఎంపీ సీటే కాకుండా ఆ పరిధిలో చాలా ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొచ్చే రాజకీయ చాతుర్యం ఉందని ఆలోచిస్తున్నారట. అధిష్టానం తనపట్ల ఉన్న ఈ సాఫ్ట్ కార్నర్ తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తన దూకుడు కొనసాగిస్తున్నారు.
ఇటీవల చంద్రబాబుతో దూరం పాటిస్తూ వస్తున్నారు నాని. టిడిపి కార్యక్రమాలలో చిన్ని ఎక్కువగా కనిపిస్తున్నారు. అప్పట్లో దీనిపై స్పందించిన ఎంపీ తన సోదరుడు కేశినేని చిన్నికి టిడిపి టికెట్ ఇస్తే, చచ్చినా తాను మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. క్యారెక్టర్ ఉన్న వారు పేదవాడయినా నెత్తిన పెట్టుకుంటానన్నారు. భూ కబ్జాదారులకు, సెక్స్ రాకెట్ నడిపే వారికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.
సోదరుడు టికెట్ ప్రస్తావన వచ్చినప్పుడు, దావూద్ ఇబ్రహీం, కాల్ మనీ, సెక్స్ రాకెట్ మాఫియా గాళ్లు, చార్లెస్ శోభరాజ్ లాంటి ఎవరైనా పార్టీలో తిరగొచ్చన్నారు. అలాంటి వ్యక్తులకు పార్టీ సీటు ఇస్తే తన మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. గొప్ప ఆశయాలతో ఏర్పడిన పార్టీ టీడీపీ అన్నారు. ఎవరికి పడితే వారికి పార్టీ టికెట్లు ఇచ్చి సిద్ధాంతాలను దెబ్బ తీయవద్దు అని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న నేతలతో కలిసి తమ్ముడు చిన్ని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో చిన్ని ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. ఇదే సమయంలో కేశినేని నాని తనపైకి తమ్ముడినే ఉసిగొల్పుతున్న సొంత పార్టీనేతలకు వారి నియోజకవర్గాలలో అసమ్మతి నేతలకు అండగా నిలుస్తూ ఎగదోస్తున్నారు. మొత్తానికి విజయవాడ పార్లమెంటు కేంద్రంగా తెలుగుదేశం పార్టీలో కేశినేని బ్రదర్స్ రెండువర్గాలుగా హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.