Telugu Global
Andhra Pradesh

రాజకీయాలు వదిలేస్తున్నా.. గల్లా జయదేవ్ ప్రకటన

ఇవాళ గుంటూరులో గల్లా జయదేవ్ టీడీపీ నేతలతో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. తాను ఎంపీగా రెండుసార్లు గెలుపొందడానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయాలు వదిలేస్తున్నా.. గల్లా జయదేవ్ ప్రకటన
X

తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. సీనియర్ రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వారసుడిగా జయదేవ్ రాజకీయాల్లోకి వచ్చారు. సొంత జిల్లా చిత్తూరులో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు ఎస్సీ రిజర్వుడ్ కావడంతో 2014లో ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో కూడా మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఎంపీగా రెండుసార్లు గెలిచిన జయదేవ్ టీడీపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్లమెంట్లో ఏపీ హక్కుల కోసం పలుసార్లు గళమెత్తారు. చక్కటి వాగ్దాటితోపాటు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ గుంటూరులో గల్లా జయదేవ్ టీడీపీ నేతలతో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. తాను ఎంపీగా రెండుసార్లు గెలుపొందడానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో వివరించారు.

రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో టీడీపీ గొంతుగా మారానని, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడినట్లు తెలిపారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఈడీ తనను వివిధ కేసుల్లో రెండుసార్లు పిలిచి విచారించిందన్నారు. తమ కుటుంబ వ్యాపారాలు నిఘా పరిధిలో ఉన్నట్లు తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనని చెప్పారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నానే భావన కూడా తనలో ఉందని జయదేవ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా మళ్లీ గెలుస్తానని, కానీ రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దానికి తోడు రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చూసుకోవడం కూడా కష్టమవుతోందన్నారు. రెండేళ్ల కిందట తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ కావడంతో అటు వ్యాపారాలు ఇటు రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకోవడం తనకు కష్టంగా మారిందని చెప్పారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు గల్లా జయదేవ్ తెలిపారు.

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పాటూరి రాజగోపాల్ కుటుంబం తనదైన ముద్ర వేసింది. 1955లో రాజకీయాల్లోకి వచ్చిన రాజగోపాల్ ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమార్తె గల్లా అరుణ పలుమార్లు మంత్రిగా వ్యవహరించారు. గల్లా అరుణ కూడా ఇప్పటికే రాజకీయాలనుంచి వైదొలుగగా, ఇప్పుడు ఆమె తనయుడు జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో ఆ కుటుంబం పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయింది.

First Published:  28 Jan 2024 7:50 AM GMT
Next Story