Telugu Global
Andhra Pradesh

ఆ లిస్టులో నారా లోకేశ్ టాప్.. నివేదిక విడుదల

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదికలో నారా లోకేశ్ అత్యంత ఆస్తిపరుడిగా నిలిచారు. లోకేశ్ మొత్తం ఆస్తుల విలువ రూ.369.27 కోట్లుగా ఉంది.

ఆ లిస్టులో నారా లోకేశ్ టాప్.. నివేదిక విడుదల
X

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ విషయంలో అగ్రస్థానంలో నిలిచారు. ఏపీ శాసన మండలి సభ్యులకు సంబంధించిన ఆస్తులు, విద్యార్హతలు, క్రిమినల్ కేసులు గురించి వారి అఫిడవిట్ల ఆధారంగా ఓ నివేదిక రూపొందించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన ఈ నివేదికలో నారా లోకేశ్ అత్యంత ఆస్తిపరుడిగా నిలిచారు. లోకేశ్ మొత్తం ఆస్తుల విలువ రూ.369.27 కోట్లుగా ఉంది. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేశ్.. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఇక 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో లోకేశ్ పదవీ కాలం పూర్తి కానుంది.

ఆస్తిపరుల్లో రెండో స్థానంలో వాకాటి నారాయణ రెడ్డి రూ. 101 కోట్లు, మూడో స్థానంలో టి. మాధవరావు రూ.36 కోట్లతో నిలిచారు. ఎమ్మెల్సీలలో అతి తక్కువ ఆస్తి స్వతంత్ర సభ్యుడు రఘువర్మ (రూ.1.84 లక్షలు) ఉన్నారు. మరోవైపు నారా లోకేశ్‌కు రూ.6.27 కోట్లు, వైసీపీ ఎమ్మెల్సీ దేవసాని చిన్న గోవిందరెడ్డికి రూ. 5.23 కోట్ల అప్పు ఉంది. సభ్యుల్లో 36 మంది కోటీశ్వరులే అని, 12 మందికి రూ.12 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఏపీ శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో వైసీపీ 32, టీడీపీ 16, పీడీఎఫ్ నలుగురు, బీజేపీ ఇద్దరు, యూటీఎఫ్ ఒక్కరు, ఇండిపెండెంట్ ముగ్గురు ఉన్నారు. వీరిలో 20 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వైసీపీకి చెందిన 13 మంది, ఆరుగురు టీడీపీ, ఒక పీడీఎఫ్ సభ్యుడిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. వైసీపీ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, గంగుల ప్రభాకర్ రెడ్డి, అనంత సత్య భాస్కర్ తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

ఎమ్మెల్సీలలో కేవలం క్రిమినల్స్, ఆస్తిపరులే కాకుండా.. విద్యావంతులు కూడా ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు డాక్టరేట్లు పొందగా, ఎనిమిది మంది పోస్టు గ్రాడ్యుయేట్స్, ఐదుగురు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నలుగరు ఇంటర్మీడియట్, ఒకరు పదో తరగతి, మరొకరు ఐదో తరగతి చదివారు.

First Published:  14 Aug 2022 1:48 PM IST
Next Story