Telugu Global
Andhra Pradesh

టీడీపీలో బీఆర్‌ఎస్‌ ఆందోళన

బీఆర్‌ఎస్‌పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పందించారు. ప్రతికూలంగా మాట్లాడారు. రాష్ట్ర స్థాయి పార్టీని తమకు తాము జాతీయ పార్టీగా మార్చేసుకుంటే కుదురుతుందా అని ప్రశ్నించారు.

టీడీపీలో బీఆర్‌ఎస్‌ ఆందోళన
X

బీఆర్ఎస్‌ పార్టీపై టీడీపీ కంగారు పడుతోంది. కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్ఎస్‌పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పందించారు. బీఆర్‌ఎస్‌ కోసం ఏపీ టీడీపీలోని నేతలకు కేసీఆర్‌ గాలమేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అశోక్‌బాబు బీఆర్‌ఎస్‌పై ప్రతికూలంగా మాట్లాడారు. రాష్ట్ర స్థాయి పార్టీని తమకు తాము జాతీయ పార్టీగా మార్చేసుకుంటే కుదురుతుందా అని అశోక్‌బాబు ప్రశ్నించారు.

అశోక్‌బాబు మరో కామెంట్ కూడా చేశారు. కేసీఆర్‌ను ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుందేమో గానీ... రాష్ట్రాన్ని విడదీసి, దెబ్బతీసి, రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వని కేసీఆర్‌ను ఏపీలో మాత్రం ఎవరూ స్వాగతించే పరిస్థితి ఉండదన్నారు. కేసీఆర్‌కు జాతీయ భావం లేదన్నది ఏపీ విషయంలోనే తేలిపోయిందన్నారు. మద్దతుగా వచ్చిన కుమారస్వామి కూడా తమ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయలేదని.. అలాంట‌ప్పుడు బీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారట కదా అన్న ప్రశ్నకు... వ్యాపారపరంగా టచ్‌లో ఉంటే ఉండొచ్చు.. టీఆర్‌ఎస్‌ వాళ్లు కూడా వ్యాపారపరంగా తమ నాయకులతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. నిజానికి కేసీఆర్‌ ఏపీ టీడీపీపై గురి పెట్టారన్న వార్తల నేపథ్యంలో అశోక్‌బాబు ఇలా మాట్లాడుతున్నారే గానీ... హరికృష్ణ చనిపోయిన సమయంలో అక్కడే టీఆర్‌ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు చర్చలు జరిపిన ఉదంతమూ ఉంది. ఇప్పుడు ఏపీలో టీడీపీకి ముప్పు వస్తుందన్న ఆందోళనతో ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతూ ఉండవచ్చు.

First Published:  6 Oct 2022 5:23 PM IST
Next Story