టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.. బాలయ్యకు ఫస్ట్ వార్నింగ్
అసెంబ్లీలో తొడగొట్టడం, మీసం మెలేయడం సరైన సంప్రదాయం కాదని అన్నారు స్పీకర్. అలాంటి చర్యలకు పాల్పడినందుకు బాలకృష్ణకు మొదటి హెచ్చరిక జారీ చేశారు.
ఏపీ అసెంబ్లీలో తొలిరోజు నుంచే సస్పెన్షన్ల పర్వం మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, పయ్యావుల కేశవ్.. వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అదే సమయంలో నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో తొడగొట్టడం, మీసం మెలేయడం సరైన సంప్రదాయం కాదని అన్నారు స్పీకర్. అలాంటి చర్యలకు పాల్పడినందుకు బాలకృష్ణకు మొదటి హెచ్చరిక జారీ చేశారు. మిగతా సభ్యులపై కూడా అధికార పక్షం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడంతో.. వారిని కూడా ఒకరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ తమ్మినేని. మొత్తంగా టీడీపీ సభ్యులందర్నీ సభ నుంచి బయటకు పంపించి వేశారు.
యూజ్ లెస్ ఫెలో..
సభలో టీడీపీ సభ్యులు వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. దీంతో స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ చెప్పినా కూడా వీడియోలు తీయడం ఆపకపోవడంతో అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. సభలో వీడియోలు తీయొద్దన్నారు.
సభలో తీవ్ర గందరగోళం..
ఉదయం సభలో బాలయ్య, అంబటి మధ్య జరిగిన ఎపిసోడ్ తో తొలిసారి సభ వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైన వెంటనే మరోసారి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వారి స్థానాల్లోనే నిలబడి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. తీవ్ర గందరగోళం మధ్య టీడీపీ సభ్యుల్ని ఆయన సస్పెండ్ చేశారు. అనంతరం స్పీకర్ టీబ్రేక్ ప్రకటించి సభను వాయిదా వేశారు.
♦