చంద్రబాబు మార్కు శ్రమదానం.. చీపురు పట్టిన ఎమ్మెల్యే
గతంలో చంద్రబాబు హయాంలో శ్రమదానం, జన్మభూమి.. పేరుతో అధికారికంగా కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు మళ్లీ అలాంటివి మొదలయ్యాయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి.
వైసీపీ హయాంలో జరగని, జరిగే అవకాశం లేని చిత్ర విచిత్రాలన్నీ కూటమి టైమ్ లో మొదలయ్యాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే రోడ్డుపై చీపురు పట్టుకుని వీధులు శుభ్రం చేశారు. అధికారులు, మున్సిపల్ ఉద్యోగులకు ఓ హెచ్చరికలా ఆయన ఈ పని చేసినా.. చంద్రబాబు మార్క్ పాలన మొదలైందని సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అర్ధరాత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉన్న రోడ్డును శుభ్రం చేశారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు, పారిశుధ్య కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరూ చూడరని, పట్టించుకోరని మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు ఎమ్మెల్యే అరవిందబాబు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రలో భాగంగా నరసరావుపేటను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు.
గతంలో చంద్రబాబు హయాంలో శ్రమదానం, జన్మభూమి.. పేరుతో అధికారికంగా కార్యక్రమాలు జరిగేవి. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ సంస్థల సిబ్బంది ఇందులో భాగస్వాములు అయ్యేవారు. శ్రమదానం, జన్మభూమితో ఫలితాలు ఏమేరకు వచ్చాయనే విషయం పక్కనపెడితే.. అదో ప్రహసనంలా సాగేదనే విమర్శలు కూడా నాడు వినిపించేవి. ఇక మోదీ హయాంలో స్వచ్ఛ భారత్ తెరపైకి వచ్చాక వాటన్నిటికీ తలదన్నేలా ఫొటో సెషన్లు జరిగేవి. మోదీని ఆదర్శంగా తీసుకుని చాలామంది నేతలు చీపురు పట్టుకుని ఫొటోలు దిగేవారు, ఆ కార్యక్రమం కంటే, దానికోసం జరిగిన పబ్లిసిటీ పీక్ స్టేజ్ కి చేరుకుంది.
వైసీపీ హయాంలో ఇలాంటి కార్యక్రమాలపై ప్రభుత్వం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అధికారులు సరిగా పనిచేయలేదని నాయకులెవరూ ఫిర్యాదు చేయలేదు, పనిచేయాలని కూడా ఎవరూ ఇలా చురకలంటించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సందడి మొదలైంది. ఇది కేవలం ఫొటోలకే పరిమితం అవుతుందా, లేక మార్పు కనపడుతుందా..? వేచి చూడాలి.