చీరాల నుంచి వైసీపీ తరఫున నేను పోటీ చేయాలనుకుంటున్నా..
చీరాల నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. అక్కడ వైసీపీలోనే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనే వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి సిద్ధమని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్. వైసీపీ తరపున చీరాల నుంచే పోటీ చేయాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అయితే పార్టీ అధినాయకత్వం నిర్ణయమే ఫైనల్ అన్నారు.
తాను నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంతో సహా అన్ని చోట్ల వైసీపీ గెలిచిందని.. దీని బట్టే ప్రజల మద్దతు జగన్‌కు ఉందన్నది స్పష్టమవుతోందన్నారు.అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదన్నారు. అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారని.. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయన్నారు.
టీడీపీ మాత్రం ఎంతసేపు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా అన్న దానిపై ధ్యాస పెట్టుకుందన్నారు. జనసేన సాయంలో గెలవాలని టీడీపీ భావిస్తోందని..కానీ టీడీపీ పతనం ఎప్పుడో మొదలైందన్నారు. కరణం బలరాం మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. జగన్‌ను కలిశారు. నేరుగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. కుమారుడిని రంగంలోకి దింపారు. అయితే చీరాల నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. అక్కడ వైసీపీలోనే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనే వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మరి టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.