చిరుతో గంటా భేటీ.. కారణం ఏంటి..?
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం అయిందని, అందుకే ఆయన్ని కలసి శుభాకాంక్షలు తెలిపారని గంటా అనుచరులు చెబుతున్నారు. కానీ అంతకు మించి ఆ భేటీలో రాజకీయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఆయన గతంలో ప్రజారాజ్యం కీలక నేత. ఒకటే సామాజిక వర్గం కూడా. సో..ఈ భేటీని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. కానీ ఇటీవల చిరంజీవి, పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కదలికలను అనుమానించవచ్చు. అసలు ఈ భేటీ వెనకున్న ఆంతర్యం ఏంటి..? రాజకీయాలు మాట్లాడారా..? లేక పరామర్శలకే పరిమితం అయ్యారా..?
ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ఓ విలక్షణ నేత. ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం అయినా.. ఆయనకు పెద్దగా పట్టింపు ఉండదు. 2019లో వైసీపీ గాలి బలంగా వీచినా.. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమధ్య విశాఖ ఉక్కు ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న గంటా.. వైసీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని, కానీ విజయసాయిరెడ్డి కారణంగా ఆయన జగన్ వరకు వెళ్లలేకపోయారని అంటుంటారు. ఈ దశలో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న గంటా.. ఇప్పుడు చిరంజీవితో ఎందుకు భేటీ అయ్యారనేదే ఆసక్తికర అంశం.
గాడ్ ఫాదర్ కు శుభాకాంక్షలు..
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం అయిందని, అందుకే ఆయన్ని కలసి శుభాకాంక్షలు తెలిపారని గంటా అనుచరులు చెబుతున్నారు. కానీ అంతకు మించి ఆ భేటీలో రాజకీయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో జనసేన తరపున చిరంజీవి పాత మిత్రులందర్నీ ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. పవన్ కల్యాణ్ ఎప్పటికైనా రాజకీయాల్లో ఉన్నత స్థాయి అందుకుంటారని, ఆ నమ్మకం తనకి ఉందంటున్న చిరంజీవి.. జనసేనకు పరోక్షంగా మద్దతు ప్రకటించారు. దీంతో అటు జనసేనలో కూడా ఉత్సాహం నిండింది. ఈ దశలో గంటా శ్రీనివాసరావు, చిరంజీవి భేటీ మరింత ఆసక్తిగా మారింది. ఒకవేళ రాజకీయ భేటీయే అయినా ఇప్పటికిప్పుడు దీనిపై ప్రకటన చేసేంత అమాయకులు కాదు గంటా, చిరంజీవి. సమయం వచ్చినప్పుడే ఆ విషయాన్ని బహిరంగ పరుస్తారు. ఈ భేటీలో ఏం జరిగిందనేది ప్రస్తుతానికి సస్పెన్సే.