Telugu Global
Andhra Pradesh

పరారీలో చింతమనేని ప్రభాకర్‌

సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చ‌ర్య‌లు చేపట్టి 24 గంటల వ్యవధిలోనే శుక్రవారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్‌ని పట్టుకున్నారు.

పరారీలో చింతమనేని ప్రభాకర్‌
X

దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పరారీలో ఉన్నారు. ఈ విషయాన్ని ఏలూరు జిల్లా నూజివీడు డీఎస్పీ జి.లక్ష్మయ్య శుక్రవారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు 12 మంది కూడా పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.

ఈనెల 13న పోలింగ్‌ సందర్భంగా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలోని ఓ పోలింగ్‌ బూత్‌ సమీపంలో జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితుడైన తాళ్లూరి రాజశేఖర్‌ని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న చింతమనేని పెద్ద సంఖ్యలో తన అనుచరులు 14 మందితో కలిసి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసులపై దౌర్జన్యం చేశారు. స్టేషన్‌లో ఎస్‌ఐ విధుల్లో ఉండగానే లాక‌ప్‌లో ఉన్న నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు చింతమనేనిపై, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన పెద్ద సంచలనమే సృష్టించింది.. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని డీఎస్పీ లక్ష్మయ్య ప్రకటించారు.

ఈ క్రమంలో దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చ‌ర్య‌లు చేపట్టి 24 గంటల వ్యవధిలోనే శుక్రవారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్‌ని పట్టుకున్నారు. ఆ వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు పరారీలో ఉన్నారని నూజివీడు డీఎస్పీ జి.లక్ష్మయ్య చెప్పారు.

అయితే.. చింతమనేని ప్రభాకర్‌ రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో బెయిల్‌ దొరికే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆయన పరారయ్యారని భావిస్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్‌ దొరికిన తర్వాత మాత్రమే బయటికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో చింతమనేనికి బెయిల్‌ దొరకడం కష్టమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

First Published:  18 May 2024 11:57 AM IST
Next Story