Telugu Global
Andhra Pradesh

టీడీపీ మేనిఫెస్టో.. హైలైట్స్ ఇవే

ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, జిల్లా స్థాయిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఈ మహాశక్తి పథకంలో ఉన్నాయి.

టీడీపీ మేనిఫెస్టో.. హైలైట్స్ ఇవే
X

2024 ఎన్నికల టార్గెట్ గా టీడీపీ మహానాడులో మేనిఫెస్టో ప్రకటించింది. ఉచితాల విషయంలో ప్రజల్ని ఆకట్టుకునేలా ఈ పథకాలున్నాయి. భవిష్యత్తుకి గ్యారెంటీ అనే పేరుతో ఓ బ్రాండ్ నేమ్ లాగా మేనిఫెస్టో పోస్టర్ డిజైన్ చేయించారు.


ఆరు రత్నాలు..

తొలి విడత మేనిఫెస్టోలో ఆరు పథకాలను ప్రకటించారు చంద్రబాబు.

మహాశక్తి

యువగళం

అన్నదాత

ఇంటింటికీ నీరు

బీసీలకు రక్షణ చట్టం

పూర్ టు రిచ్.. ఇలా వీటిని వర్గీకరించారు.

మహాశక్తి పథకంలో 4 సబ్ కేటగిరీలున్నాయి. ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున వారి ఖాతాల్లో వేస్తారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అమ్మఒడి లాంటిదే తల్లికి వందనం. అయితే ఇక్కడ ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామంటోంది టీడీపీ. చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొకరికి ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, జిల్లా స్థాయిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఈ మహాశక్తి పథకంలో ఉన్నాయి.

నిరుద్యోగ భృతికి పేరు మార్చి యువగళం అని పెట్టారు. 20లక్షలమందికి ఉద్యోగాలిచ్చేందుకు ప్రణాళిక రచిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3వేల రూపాయల చొప్పున భృతి ఇస్తారు.

అన్నదాత పథకం రైతు భరోసా లాంటిదే. రైతులకు ప్రతి ఏడాదీ 20వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది టీడీపీ. ఇంటింటికీ మంచినీరు పథకం ద్వారా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి, సురక్షిత మంచినీరు ఇస్తామని చెప్పారు. బీసీలపై దాడులు జరగకుండా బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

పూర్ టు రిచ్..

సమాజంలో పేదవారిని ధనికులుగా చేసే కార్యక్రమం ఇది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపడతానన్నారు చంద్రబాబు. ఇప్పటికే ఆయన పలు దఫాలు పి-4 అనే ప్రణాళికను ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగానే పూర్ టు రిచ్ అనేది అమలు చేస్తామంటున్నారు. తొలివిడత మేనిఫెస్టోకి వచ్చిన స్పందన చూసి మలి విడతలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.

First Published:  29 May 2023 12:25 AM GMT
Next Story