Telugu Global
Andhra Pradesh

నేటినుంచి టీడీపీ మహానాడు.. నాయకుల్లో ఆ ఊపు ఉందా..?

ఇప్పటికే నవరత్నాలకు ఏపీ బడ్జెట్ సర్దుబాటు కావడంలేదు. ఇవి కొనసాగిస్తూ మిగతా హామీలు నెరవేరుస్తామని టీడీపీ చెబితే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు.

నేటినుంచి టీడీపీ మహానాడు.. నాయకుల్లో ఆ ఊపు ఉందా..?
X

టీడీపీ మహానాడు అంటే ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పండగేనని చెప్పాలి. తీర్మానాలు, ప్రసంగాలు, వైరి వర్గాలపై విమర్శలు, ఆఖరికి భోజనాలు కూడా స్పెషల్ గానే ఉంటాయి. కానీ 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత టీడీపీ మహానాడు కళ తప్పింది. ఆ మాటకొస్తే ఈరోజు నుంచి జరగబోతున్న ఎన్నికల మహానాడులో కూడా ఉత్సాహం ఉరకలెత్తే పరిస్థితి లేదు.

అవకాశమివ్వని జగన్..

2019 ఎన్నికలకు ముందు ఏపీలో ప్రతి ఒక్కరికీ సీన్ అర్థమైపోయింది. అప్పట్లో జగన్ పాదయాత్రకు వస్తున్న ప్రచారం, ఆ ఊపు చూస్తే టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమని తేలిపోయింది, అయితే అంత భారీ ఓటమి టీడీపీ నేతలు కూడా ఊహించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ 2023లో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆ స్థాయి ఉత్సాహం, ఊపు ఉందా. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం నాయకుల్లో ఉందా..? టీడీపీ అనుకూల మీడియా హడావిడి మినహా వైసీపీ ఓటమికి బలమైన కారణాలేవీ కనిపించడంలేదు.


నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే కచ్చితంగా ఈ మహానాడు టీడీపీకి పండగేనని అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా టీడీపీ మీడియా హైప్ తప్ప ఏమీ లేదనే విషయం తేలిపోయింది. పాదయాత్రలో లోకేష్ ప్రసంగాల్లో ఆకట్టుకునే హామీలు లేవు. వైసీపీని ఇరుకున పెట్టేలా పగడ్బందీ విమర్శలు లేవు. సో.. యువగళం కూడా మహానాడులో పెద్ద హాట్ టాపిక్ కాబోదు.

మేనిఫెస్టోతో మేజిక్ చేస్తారా..?

పోనీ మహానాడులో మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్ని ఆకట్టుకుంటారా అంటే.. మేనిఫెస్టోకి, హామీలకు టీడీపీ ఇచ్చే విలువ ఏపాటిదో ఈపాటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది. పైగా ఏ కొత్త హామీ ఇచ్చినా వైసీపీ నవరత్నాలతో పోలిక ఉండనే ఉంటుంది. ఇప్పటికే నవరత్నాలకు ఏపీ బడ్జెట్ సర్దుబాటు కావడంలేదు. ఇవి కొనసాగిస్తూ మిగతా హామీలు నెరవేరుస్తామని టీడీపీ చెబితే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు.

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఈరోజు మహానాడు ప్రారంభమవుతుంది. ఈనెల 29తో ముగుస్తుంది. ఈ మహానాడుకి 10నుంచి 15 లక్షలమంది వస్తారని టీడీపీ చెబుతోంది. మహానాడులో చంద్రబాబు ప్రసంగాలు ఆకట్టుకుంటాయా, చినబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారా..? ఈ మూడురోజుల్లో తేలిపోతుంది.

First Published:  27 May 2023 7:48 AM IST
Next Story