Telugu Global
Andhra Pradesh

టీడీపీ మహా శక్తి.. వైసీపీ మహిళా శక్తి

వచ్చే ఎన్నికల్లో మహిళను టార్గెట్ చేసుకుని అన్ని పార్టీలు కొత్త పథకాలతో తెరపైకి రావడం విశేషం. టీడీపీ మహా శక్తి అంటే, వైసీపీ మహిళా శక్తి అంటోంది. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి మహిళల కోసం మరిన్ని పథకాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

టీడీపీ మహా శక్తి.. వైసీపీ మహిళా శక్తి
X

2024 ఎన్నికలకు సంబంధించి.. మినీ మేనిఫెస్టో ఇప్పటికే ప్రకటించింది టీడీపీ. అందులో కొన్ని గ్యారెంటీలను పొందుపరిచింది. వాటిలో 'మహాశక్తి' కూడా ఒకటి. మహిళలకు ఇచ్చే గ్యారెంటీలకు మహాశక్తి అనే పేరు పెట్టారు చంద్రబాబు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం పేరిట ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అమలులోకి వచ్చే పథకాలు. అయితే ఇప్పుడే వైసీపీ 'మహిళా శక్తి'ని పరిచయం చేస్తోంది. కొత్తగా 'మహిళా శక్తి' పేరిట మహిళలకు స్వయం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రోజు నుంచి లాంఛనంగా ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు భరోసా ఇస్తున్నారు సీఎం జగన్.

పొదుపు సంఘాల సభ్యులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు 'మహిళా శక్తి' పేరుతో ఆటోలను పంపిణీ చేయబోతోంది వైసీపీ ప్రభుత్వం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అనుసంధానంగా ఈ పథకం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మండలాల్లో 660 మందికి ఈ ఆటోలను అందజేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ రోజు తొలివిడతగా 231 మందికి ఆటోలు అందజేస్తారు. జిల్లాలవారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆయా జిల్లా కలెక్టర్లు వీటిని అందిస్తారు.

మహిళాసాధికారత దిశగా.. పొదుపు సంఘాల మ­హి­ళలకు వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత పథకాలను అందిస్తోంది వైసీపీ ప్రభుత్వం. వీటికి అదనంగా ఇప్పుడు మహిళా­ శక్తిని జత చేస్తోంది. ఈ పథకం ద్వారా ఆటో కొనుగోలుకి అయ్యే ఖర్చులో 90 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. కేవలం 10 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 90శాతం రుణానికి పూర్తిగా వడ్డీ మినహాయింపు ఉంటుంది. అంటే కేవలం అసలు మొత్తాన్ని రెండేళ్ల కాల వ్యవధిలో లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపంలో ఒక్కో మహిళకు లక్షన్నర రూపాయలు ఆర్థిక లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.

మొత్తమ్మీద వచ్చే ఎన్నికల్లో మహిళను టార్గెట్ చేసుకుని అన్ని పార్టీలు కొత్త పథకాలతో తెరపైకి రావడం విశేషం. టీడీపీ మహా శక్తి అంటే, వైసీపీ మహిళా శక్తి అంటోంది. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి మహిళల కోసం మరిన్ని పథకాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

First Published:  7 Dec 2023 8:51 AM IST
Next Story