Telugu Global
Andhra Pradesh

వీకెండ్ కోసం టీడీపీ ఎదురుచూపులు!

ఇన్నాళ్లు పార్టీలో అన్నీ తానై నడిపించిన చంద్రబాబు.. సెకండ్ గ్రేడ్ నాయకులెవరికీ ఎదిగే అవకాశం ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు పార్టీలో నాయకత్వం కొరత స్పష్టంగా కనబడుతోంది.

వీకెండ్ కోసం టీడీపీ ఎదురుచూపులు!
X

టీడీపీ ఎంత బలహీనంగా ఉందో చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందరికీ అర్థమైంది. నంద్యాలలో బాబుని అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. విజ‌య‌వాడ‌లోని సీఐడీ ఆఫీస్‌కి రోడ్డు మార్గంలో తరలించారు. వాస్తవానికి బాబు వయసు, హోదా దృష్ట్యా హెలికాప్టర్ సదుపాయం కల్పిస్తామని అధికారులు చెప్పినా.. బాబు తిరస్కరించారు. దానికి రాజకీయం కారణం కూడా ఉందని వైసీపీ ఆరోపించింది. అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత నంద్యాల టు విజ‌య‌వాడ మార్గంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి అడ్డుకుంటారని బాబు ఊహించారు. కానీ.. ఓ రెండు చోట్ల మినహా జర్నీ అంతా సాఫీగా సాగిపోయింది. ఇక్కడే టీడీపీ ప్రస్తుత స్టామినా ఏంటో.. అందరికీ అవగతమైంది.

వీకెండ్స్‌లో మాత్రమే హడావుడి

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఎక్కడా స్పందన కనిపించలేదు. అలానే చాలా మంది నాయకులు కూడా మిన్నకుండిపోయారు. దాంతో క్యాడర్‌లో కూడా కదలిక కనిపించలేదు. అయితే.. బాబు అరెస్ట్ అయిన వారం రోజుల తర్వాత తీరిగ్గా వీకెండ్స్‌లో హైదరాబాద్, బెంగళూరులో సాప్ట్‌వేర్ ఇంజినీర్లు కార్ల ర్యాలీతో హడావుడి చేశారు. అప్పటికిగానీ టీడీపీకి తమ బలం ఏంటో తెలియరాలేదు. ఇక అక్కడి నుంచి వీకెండ్స్‌లోనే సాప్ట్‌వేర్ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని కార్యక్రమాలకి ప్లాన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. శనివారం రాత్రి నిరసనలకి పిలుపు ఇస్తున్నారు. ఇక మిగిలిన రోజులు అందరూ గప్‌చుప్. ఎలాంటి హడావుడి ఉండదు.

మోత, క్రాంతి.. ఇక నెక్ట్స్ ఏంటో..?

సెప్టెంబరు 30 (శనివారం) రాత్రి మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. కానీ.. నారా లోకేష్, నారా బ్రహ్మణి, భువనేశ్వరి, కొంత మంది టీడీపీ నేతలు, పార్టీ అనుకూల వర్గం మినహా ఎవరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ తర్వాత అక్టోబరు 7 (శనివారం) కాంతితో క్రాంతి అంటూ మరో కార్యక్రమం చేపట్టారు. ఈసారి కూడా మళ్లీ వాళ్లే. అయితే.. అదనంగా ఇండస్ట్రీ నుంచి రాఘవేంద్రరావు మాత్రం సపోర్ట్ చేశారంతే. దాంతో ఈనెల 14 (శనివారం) ప్రోగ్రామ్ అయినా కాస్త ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాబు లేకపోతే.. ఇంతేనా?

చంద్రబాబు జైల్లో ఉండటంతో ఇప్పుడు టీడీపీని నడిపించే నాయకుడి కోసం కేడర్ ఎదురుచూస్తోంది. నారా లోకేష్ ఢిల్లీ పర్యటన పేరిట.. అక్కడే ఉండిపోతున్నారు. మరోవైపు నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరికి రాజకీయాలపై కనీస అవగాహన కూడా లేదు. ఇన్నాళ్లు పార్టీలో అన్నీ తానై నడిపించిన చంద్రబాబు.. సెకండ్ గ్రేడ్ నాయకులెవరికీ ఎదిగే అవకాశం ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు పార్టీలో నాయకత్వం కొరత స్పష్టంగా కనబడుతోంది. అన్నింటికీ మించి వీకెండ్ నిరసన కార్యక్రమాలను కేవలం 1-2 రోజుల ముందే ప్రకటిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ ఫెయిలవుతోంది. దాంతో అవన్నీ కేవలం ఒక సామాజిక‌వ‌ర్గం నిర‌స‌న కార్య‌క్ర‌మాలుగా మిగిలిపోతున్నాయి.

First Published:  10 Oct 2023 3:49 AM GMT
Next Story