చంద్రబాబు వద్దంటే.. లోకేష్ దగ్గరకు
లోకేష్‌కి తెలియకుండానే యువగళం పాదయాత్రని టీడీపీ నేతలు, టికెట్లు ఆశిస్తున్నవారు తమ ఆధిపత్య ప్రదర్శనకి వేదికగా మార్చేస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. చాలావరకూ ఆ నియోజకవర్గ నేతలు యువగళం సమన్వయ కమిటీలతో కోఆర్డినేట్ చేసుకుని నిర్వహించుకుంటున్నారు. జనస్పందన బాగానే ఉంది. పాదయాత్ర సాగే ఆయా నియోజకవర్గాల ప్రజలు, వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాలు సమయానికి పూర్తి చేయడం కమిటీలకి చాలా కష్టంగా మారింది.
పాదయాత్రకి బయట నుంచి నేతలు ఎవరూ రావొద్దని లోకేష్‌తోపాటు పెద్దలు, సమన్వయ కమిటీ బాధ్యులు కూడా సూచిస్తున్నారు. యువగళంలో భాగంగా ఆయా నియోజకవర్గంలో సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, బయట రాజకీయాలు-ఇతర కార్యక్రమాలు పాదయాత్రలోకి తీసుకురాకూడదనేది కమిటీ ఆలోచన. అయితే ఇవేమీ పట్టించుకోని టీడీపీ నేతలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి యువగళం పాదయాత్రని వాడుకోవాలని చూస్తున్నారు.
భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జికి చెప్పకుండా సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసు ఇచ్చారు. వెంటనే భాష్యం ప్రవీణ్ యువగళం పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఆశీస్సులు తనకి ఉన్నాయనేలా యువగళం పాదయాత్ర నుంచి ప్రవీణ్ సంకేతాలు పంపారు. వాస్తవంగా ఇతర నియోజకవర్గ నేతలని యువగళం పాదయాత్రకి రావొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినా, ఇలా వస్తూ లోకేష్ మద్దతు తమకు ఉందనేలా ప్రచారం చేసుకుంటున్నారు.
ఎచ్చెర్ల టికెట్ ఆశిస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు తనకి ఉన్న పరిచయాలతో ప్రకాశం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో లోకేష్‌ని కలిశారు. దాన్ని పెద్ద ఎత్తునప్రచారం చేసుకుంటున్నారు. ఏ పదవీ లేని కలిశెట్టి అప్పలనాయుడు లోకేష్‌ని కలిస్తే, తానేమీ తక్కువ తిన్నానా అంటూ మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. యువనేతని వదలకుండా నడుస్తూ దిగిన ఫొటోలు బయటకు వదిలారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇటీవల శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గొండు శంకర్ రెబల్‌గా మారి సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే గొండు శంకర్ యువగళం పాదయాత్రలో పాల్గొని లోకేష్‌తో ఫొటోలు దిగి ఆయన ఆశీస్సులు తనకేనంటూ బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో పార్టీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారని అర్థమైపోయింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో తండ్రి వద్ద సమీక్షలో మందలింపు ఎదురైతే, వెంటనే వారు పాదయాత్రలో ప్రత్యక్షమై తనయుడి ఆశీస్సులు తమకున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి నారా లోకేష్‌కి తెలియకుండానే యువగళం పాదయాత్రని టీడీపీ నేతలు, టికెట్లు ఆశిస్తున్నవారు తమ ఆధిపత్య ప్రదర్శనకి వేదికగా మార్చేస్తున్నారు.