సైకిల్ దిగి ఫ్యాన్ కింద కూర్చుందాం!.. వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ నేతలు
చంద్రబాబు సీనియర్లను పక్కనపెట్టేశారని, కనీసం తమకు ఓ మాట కూడా చెప్పకుండానే కొత్తవారిని తీసుకొచ్చారని వారు ఆగ్రహంగా ఉన్నారు.
పొత్తులో భాగంగా సీట్లు దక్కని టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. సీనియర్ టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. పులివెందులలో వైఎస్‌పైనా, జగన్‌పైనా పోటీ చేసి ఓడిపోయిన సతీష్‌రెడ్డి తనకు వైసీపీ నుంచి పిలుపు వచ్చిందని చెప్పారు. కృష్ణా జిల్లా నేతలు బుద్ధప్రసాద్, వేదవ్యాస్‌తోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. విజయవాడ సిటీలో సీటు దక్కని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారు.
సీనియర్లను పక్కన పెట్టేశారని ఆగ్రహం
చంద్రబాబు సీనియర్లను పక్కనపెట్టేశారని, కనీసం తమకు ఓ మాట కూడా చెప్పకుండానే కొత్తవారిని తీసుకొచ్చారని వారు ఆగ్రహంగా ఉన్నారు. భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయనప్పుడు ఇంకెంతకాలం ఆ పార్టీకి విశ్వసనీయంగా ఉండాలన్నది వారి ఆవేదన. పులివెందులలో టీడీపీ జెండా పట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో తాను ఊరూరూ తిరిగి పార్టీకి క్యాడర్‌ను పెంచానని, తనను పట్టించుకోలేదని సతీష్‌రెడ్డి మనసులోని బాధను వెళ్లగక్కారు. ఉండిలో తన అనుచరుడిగా తిరిగిన వ్యక్తిని, తాను తీసుకెళ్లి చంద్రబాబుకు పరిచయం చేసిన వ్యక్తిని నెత్తికెక్కించుకుని, తనను కరివేపాకులా తీసిపారేశారని, తానేంటో చూపిస్తానని వేటుకూరి మండిపడుతున్నారు. బుద్ధప్రసాద్, వేదవ్యాస్ లాంటి సీనియర్ నేతలు గుంభనంగా ఉన్నా లోలోపల రగిలిపోతున్నారు.
వైసీపీలోకి వచ్చినా టికెటిచ్చే పరిస్థితి ఉందా?
అధికార పార్టీ కావడం, సంక్షేమ పథకాలతో ప్రజల్లో బాగా పాజిటివ్ ఫీల్ ఉన్న నేపథ్యంలో వైసీపీకి అభ్యర్థుల కొరత ఉండకపోవచ్చు. కాబట్టి కొత్తగా టీడీపీ నుంచి వచ్చేవారికి ఇప్పటికిప్పుడు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని పార్టీ వర్గాల విశ్లేషణ. అయితే పార్టీ విజయానికి కృషి చేసినవారికి తర్వాత అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చి తీసుకోవచ్చు. తమకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు.. తమకు నమ్మకద్రోహం చేసిన టీడీపీని ఓడించడానికి కృషి చేస్తామనే భావనలోనూ కొందరు నేతలున్నారు. అలాంటి వారిని మాత్రం ఎలాంటి శషభిషలు లేకుండా వైసీపీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు.