ఆధారాల్లేవంటున్నారే గానీ అవినీతి చేయలేదని చెప్పట్లేదు.. ఏంటో ఈ టీడీపీ లీడర్లు?
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్‌నెట్ కేసు.. ఇలా చంద్రబాబు హయాంలో జరిగిన ఒక్కో అవినీతి బాగోతాన్ని తవ్వితీసే పని పెట్టుకుంది జగన్ ప్రభుత్వం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మూడు వారాలుగా రిమాండ్‌లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు బయటికి రావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నా పనికావడం లేదు. ఒకవేళ అందులో నుంచి బయటికి వచ్చినా తర్వాత రెండు, మూడు కేసులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఫ్యామిలీ, టీడీపీ లీడర్లు చేసే కామెంట్లు, ఇచ్చే స్టేట్‌మెంట్లు మాత్రం ఒక్క విషయంలో జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.
సాధారణంగా ఏదైనా అవినీతి ఆరోపణ వస్తే నాయకులు అబ్బే మేం ఎలాంటి అవినీతి చేయలేదని వాదిస్తారు. కేసు పెడితే విచారణలోనూ, ఆఖరికి కోర్టులోనూ అదే చెబుతారు. కానీ ఇక్కడ టీడీపీ లీడర్లు మాత్రం అవినీతి చేయలేదని వాదించకుండా.. ఆధారాల్లేవుగా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి ఇప్పుడు ఆధారాలు వెతుకుతున్నారు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే వారు అవినీతి జరగలేదని కాకుండా మీ దగ్గర ఆధారాల్లేవు కాబట్టి అవినీతిని నిరూపించలేరన్నట్లుగా టీడీపీ వారి తీరు ఉందని అధికార పక్షం దుయ్యబడుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.371 కోట్ల అవినీతి జరిగిందంటే అసలా ప్రాజెక్టు స్థాయి ఎంత? అందులో అంత అవినీతి చేయగలమా అంటున్నారు చాలామంది టీడీపీ లీడర్లు. అంతే తప్ప అవినీతి చేయలేదని చెప్పట్లేదు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో క్విడ్ ప్రో కో చేశారంటే కూడా అదే బాణీ. ఒక్క రూపాయి ఖర్చు పెట్టని, ఒక్క ఎకరం కూడా కొనని ప్రాజెక్టులో అవినీతి చేశామనడానికి ఆధారాలు ఏం ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. రింగ్ రోడ్ మీ భూముల వైపుగా తిప్పుకుని వాటికి రేట్లు పెంచుకునేలా ఎలైన్‌మెంట్ మార్చారు అన్న ఆరోపణకు ఈ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మేం అవినీతి చేశామనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే టీడీపీ లీడర్ల వ్యవహారం మేం అవినీతి చేశాం.. కానీ మీ దగ్గర ఆధారాల్లేవు కదా అన్నట్లుగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.