పెద్దిరెడ్డి పర్యటనకు అడ్డు.. టీడీపీ తప్పుమీద తప్పు
వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఇప్పటికే ఓ తప్పు చేశారు టీడీపీ నేతలు, నాయకుల్ని కూడా నియోజకవర్గాల్లో తిరగనివ్వకుండా ఇప్పుడు మరో తప్పు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పర్యటనలకు ఎక్కడా ఆ పార్టీ శ్రేణులు అడ్డుపడలేదు, యువగళం యాత్రను ఎక్కడా అడ్డుకోలేదు, పవన్ కల్యాణ్ వారాహికి ఎక్కడా వైసీపీ నాయకులు బ్రేక్ లు వేయాలనుకోలేదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు విడుదలై 10రోజులు గడవకముందే ఏపీ రణరంగంగా మారిపోయింది. కక్షలు, కార్పణ్యాలు, దాడులకు ఏపీ అడ్డాగా మారిపోయింది. కనీసం వైసీపీ నాయకులను కూడా బయట తిరగనిచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పర్యటనను ఇలాగే అడ్డుకున్నారు టీడీపీ నేతలు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు ముందుగానే రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. మాజీ మంత్రి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గుమికూడారు. నియోజకవర్గంలో పర్యటనకు రావొద్దని, వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పట్టణంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. వీరిని సముదాయించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. చివరకు పెద్దిరెడ్డి తన పర్యటన వాయిదా వేసుకున్నారనే సమాచారం బయటకు రావడంతో టీడీపీ నేతలు రోడ్లు ఖాళీ చేశారు.
ఎందుకీ విద్వేషం...?
పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటిస్తే తప్పేంటి..? స్థానిక ప్రజా ప్రతినిధిగా ఆయనకు తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా..? సీఎం చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు ఇచ్చే సందేశం ఇదేనా..? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉంటే ప్రతిపక్షనేతగా చంద్రబాబు రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేవారా, లోకేష్ యువగళం యాత్ర సజావుగా సాగేదా..? అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వకపోతే ఎలా..? రేపు పరిస్థితులు తారుమారయితే టీడీపీ నేతలను వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తే దానికి ఎవరిని బాధ్యులుగా చేయాలి..? పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఇప్పటికే ఓ తప్పు చేశారు, నాయకుల్ని కూడా నియోజకవర్గాల్లో తిరగనివ్వకుండా ఇప్పుడు మరో తప్పు చేస్తున్నారు. తప్పుమీద తప్పు చేస్తున్న టీడీపీ వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజుకూడా వస్తుందని ఊహించినట్టులేదు.