ప్రచారంకోసం పాట్లు.. పదవులకోసం టీడీపీ నేతల అగచాట్లు
మంత్రి పదవులపై ఆశ ఉన్న వారంతా ముందుగానే రంగంలోకి దిగారు. సమీక్షలు, సమావేశాల పేరుతో హడావిడి మొదలు పెట్టారు.
పదవులకోసం వేచి చూసిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అధికారం చేతికందుతోన్న వేళ మళ్లీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మాజీ మంత్రులు, సీనియర్లు అయి ఉండి కూడా ఇప్పటి వరకూ పదవులు పొందనివారు, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రి పదవులపై కర్చీఫ్ వేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు నిత్యం లైమ్ లైట్లో ఉండేందుకు ప్రయత్నించిన నేతలు, ఇప్పుడు పదవులకోసం తిరిగి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తాజాగా మచిలీపట్నం నుంచి గెలుపొంది మళ్లీ మంత్రి పదవికోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడలేని హడావిడి మొదలు పెట్టారు. మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు చేస్తూ అధికారులను హడలెత్తిస్తున్నారు. మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్ లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నంలో నెలకొన్న తాగునీటి సమస్యపై అప్పుడే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. నీటి సరఫరా సరిగా లేదని ఏఈ సాయిప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి విషయంలో అలసత్వం వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మంత్రి పదవులపై ఆశ ఉన్న వారంతా ముందుగానే రంగంలోకి దిగారు. సమీక్షలు, సమావేశాల పేరుతో హడావిడి మొదలు పెట్టారు. తాము చేస్తున్న పనులన్నిటికీ పెద్ద ఎత్తున ప్రచారం వచ్చేలా చూసుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిలో పడి పనిమంతులుగా పేరు తెచ్చుకోవాలనేది వీరి తాపత్రయం. మరి ఎంతమంది ఆశలు నిజమవుతాయో చూడాలి.