నాదెండ్లకు మరో అవమానం.. ఈసారి టీడీపీ అటాక్
ఆలపాటి వర్గమే ఈ దాడికి కారణం అని అంటున్నారు. అయితే నాదెండ్ల మాత్రం సైలెంట్ గా అక్కడినుంచి నిష్క్రమించారు.
టీడీపీ-జనసేన పొత్తుకి ముఖ్య కారణం నాదెండ్ల మనోహర్ నడిపిన రాయబారాలేననే ప్రచారం ఆ రెండు పార్టీల్లో బలంగా ఉంది. అదే సమయంలో పొత్తుల్లో సీట్లు కోల్పోయిన అసంతృప్తులకి ఆయనపై పీకలదాకా కోపం ఉంది. స్వయానా ఆయన వల్ల తెనాలి సీటు కోల్పోయిన ఆలపాటి రాజాకు ఇంకెంత కోపం ఉంటుందో ఊహించగలం. అందుకే నాదెండ్లపై ఆయన అనుచరులు వాటర్ బాటిల్ తో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆలపాటి వర్గం దాడి చేసినా నాదెండ్ల కిక్కురుమనకుండా సైలెంట్ గా ఉన్నారు. ఏమీ మాట్లాడలేక తెనాలిలో ప్రచారాన్ని హడావిడిగా ముగించుకుని బయలుదేరారు.
అసలేం జరిగింది..?
తెనాలిలో టీడీపీ-జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో పాదయాత్ర ప్రారంభించారు. మధ్యలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వచ్చి కలిశారు. ఆ తర్వాత రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల జిందాబాద్.. అంటూ నినాదాలిచ్చారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. నాదెండ్ల మనోహర్‌పైకి ఎవరో వాటర్ బాటిల్ ని విసిరారు, అది ఆయన తలకు బలంగా తాకింది. ఆలపాటి వర్గమే ఈ దాడికి కారణం అని అంటున్నారు. అయితే నాదెండ్ల మాత్రం సైలెంట్ గా అక్కడినుంచి నిష్క్రమించారు.
జనసేనకు కేవలం 24 సీట్లు అని తేలిన తర్వాత నాదెండ్ల టార్గెట్ గా చాలామంది జనసేన నేతలే గొడవలకు దిగారు. నాదెండ్లను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. తెనాలిలో తనకి సీటు లేకుండా చేసిన నాదెండ్లను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు ఆలపాటి రాజా. పనిలో పనిగా ఆయన అనుచరులు ఇలా నాదెండ్లకు ఝలక్ ఇస్తున్నారు. ఆయన్ను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. మొత్తమ్మీద పొత్తుల వ్యవహారంతో ఇటు టీడీపీ, అటు జనసేనలో పలువురు నేతలకు శత్రువుగా మారారు నాదెండ్ల.