Telugu Global
Andhra Pradesh

ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమంటే దాడి చేస్తారా?.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం

వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి... దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమంటే దాడి చేస్తారా?.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం
X

ప్రజలపై టీడీపీ నేతలు, కార్యకర్తల దాష్టీకం రోజురోజుకీ పెచ్చుమీరిపోతోంది. ప్రతిపక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరోపక్క సమస్యలపై ప్రశ్నించిన, ఫిర్యాదు చేసినవారిపై సైతం దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరగటిచర్లలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.

ఇంటికెళ్లి.. వృద్ధుడని చూడకుండా.. మూకుమ్మడి దాడి

ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వేయించారు. దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామారావు పల్నాడు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్రవారం మూకుమ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి... దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామారావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. రామారావుపై దాడికి నిరసనగా ఆయన ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి వినతిపత్రం సమర్పించారు. నిందితులను అరెస్ట్‌ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు.

దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు...

అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమంటే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా? అంటూ టీడీపీ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామారావుపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. అడ్డువచ్చిన ఆయన తల్లి (90)ని కూడా పక్కకు నెట్టేశారని, ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ శ్రేణుల‌ను అదుపులో పెట్టుకోవాలని, దాడులు ఆపకపోతే ఏం చేయాలో తమకు తెలుసని ఆయన హెచ్చరించారు.

ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదు..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివాసరావు ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతుపైనే కొనసాగుతోందని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు.

First Published:  7 July 2024 4:39 AM GMT
Next Story