Telugu Global
Andhra Pradesh

జగన్‌ కారణంగానే నోటీసులు

జగన్‌ ఒత్తిడి కారణంగానే తాజా నోటీసులు అని టీడీపీ చెబుతున్నప్పటికీ... మరి ఎవరి ఒత్తిడి కారణంగా ఇంతకాలం నోటీసులకు సంబంధించి లీకు వార్త కూడా బయటకు రాలేదన్నది ఆసక్తికరమే.

జగన్‌ కారణంగానే నోటీసులు
X

బోగస్‌ కంపెనీల ద్వారా ముడుపులు తీసుకున్న కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఐటీ శాఖ‌ నోటీసులు ఇచ్చింది నిజమేనని టీడీపీ అంగీకరించింది. కాకపోతే హిందుస్థాన్‌ టైమ్స్ ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత, వైసీపీ దాడి మొదలుపెట్టాక టీడీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. ఇది పాత కేసని.. గతేడాదే నోటీసులు ఇచ్చారని అప్పట్లోనే చంద్రబాబు వాటిని తిరస్కరించారని టీడీపీ మీడియా చెబుతోంది. ఎవరో ఆరోపణలు చేశారని చెప్పడం మినహా తాను ముడుపులు తీసుకున్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవని.. పైగా నోటీసులు ఇచ్చిన విభాగానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని చంద్రబాబు నోటీసులను గతేడాది తిరస్కరించినట్టు టీడీపీ మీడియా చెబుతోంది.

చంద్రబాబు స్పందన తర్వాత ఐటీ మౌనంగా ఉండిపోయిందని... కానీ ఇప్పుడు హఠాత్తుగా మరోసారి నోటీసులు జారీ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారంటూ ఆ పార్టీకి అనుకూలంగా ఉండే పత్రిక వెల్లడించింది. పైగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమకు ఇవ్వాలంటూ ఐటీ శాఖపై ఏపీ సీఐడీ ఒత్తిడి కూడా తెచ్చారని... అందుకు ఐటీ శాఖ అంగీకరించలేదని... చివరకు జగన్‌మోహన్ రెడ్డి ఒత్తిడి పనిచేయడంతోనే చంద్రబాబుకు ఆగస్టు 4న మరోసారి నోటీసులు ఇచ్చారని టీడీపీ మీడియా ఆరోపణ.

గతంలో నోటీసులను తిరస్కరించే సమయంలో చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలను ఐటీ తోసిపుచ్చడంతో పాటు... ముడుపులకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రతినిధి ఇచ్చిన వాంగ్మూలం సరిపోతుందని... నోటీసులు ఇచ్చే పరిధి లేదన్న వాదనలో పస లేదంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గతేడాది నోటీసులు ఇచ్చినా ఏ ఒక్క మీడియా సంస్థకూ ఆ సమాచారం అందకపోవడం. చివరకు వైసీపీ మీడియాకు కూడా సమాచారం అందలేదంటే ఐటీ అధికారులు చాలా రహస్యంగా నోటీసులు ఇచ్చి చంద్రబాబు పరువు కాపాడినట్టుగా ఉంది. జగన్‌ ఒత్తిడి కారణంగానే తాజా నోటీసులు అని టీడీపీ చెబుతున్నప్పటికీ... మరి ఎవరి ఒత్తిడి కారణంగా ఇంతకాలం నోటీసులకు సంబంధించి లీకు వార్త కూడా బయటకు రాలేదన్నది ఆసక్తికరమే.

First Published:  2 Sept 2023 10:38 AM IST
Next Story