Telugu Global
Andhra Pradesh

రెడ్‌ బుక్‌లో ఆ పేజీ చించేశావా.. లోకేశ్‌?.. - ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

వైసీపీ తరపున జగన్‌ సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరిన కోనేటి ఆదిమూలంను సత్యవేడు అభ్యర్థిగా ఖరారు చేయడాన్ని టీడీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రెడ్‌ బుక్‌లో ఆ పేజీ చించేశావా.. లోకేశ్‌?.. - ధ్వజమెత్తిన టీడీపీ నేతలు
X

టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాల వల్ల రాజుకున్న చిచ్చు రోజురోజుకూ పెరుగుతోంది. ఇక అభ్యర్థుల ప్రకటనతో అది మరింత ఎక్కువవుతోంది. తిరుపతి, సత్యవేడు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన శ్రేణులు చేస్తున్న ఆందోళనలు, వారి ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ఈ వ్యవహారాలు టీడీపీ, జనసేన అధినేతలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ అధినేతలకు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఆందోళనలతో రచ్చరచ్చ

వైసీపీ తరపున జగన్‌ సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరిన కోనేటి ఆదిమూలంను సత్యవేడు అభ్యర్థిగా ఖరారు చేయడాన్ని టీడీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతూ నిత్యం ధర్నాలు చేస్తున్నారు. ఆందోళనలతో రచ్చ రేపుతున్నారు. ఇక సత్యవేడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మీ యాదవ్‌ అయితే.. నారా లోకేశ్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులతో కలిసి మంగళవారం ధర్నా చేపట్టిన ఆమె.. లోకేశ్‌పై తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు.

రెడ్‌ బుక్‌లో ఆ పేజీ చించేశారా?

లోకేశ్‌ గారూ.. మీరు సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఒక మాట అన్నారు.. వైసీపీ వారి పేర్లు రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నాను అని.. ఆ రెడ్‌ బుక్‌లో ఆదిమూలం పేరు ఉందా? లేదా? ఉంటే ఆ పేజీని చించేసి టికెట్‌ ఇచ్చారా? ఆ ఎమ్మెల్యే చేయని అరాచకాలు లేవు. టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టారు. ఆదిమూలం కనీసం వైసీపీ సభ్యత్వానికైనా రాజీనామా చేశారా? అటువంటి వ్యక్తికి టికెట్‌ ఎలా ఇస్తారు? మాకు ఇదేం దౌర్భాగ్యం.. అంటూ వరలక్ష్మీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జనసేన తరపున నేనే పోటీ చేస్తా..

ఇక తిరుపతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మంగళవారం పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ జనసేనకు కేటాయించారని, స్థానికులకు కాకుండా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సీటు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఏమాత్రం సమంజసంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలోని మూడు పార్టీలు తిరుపతి అభ్యర్థి విషయంపై పునరాలోచించాలని ఆమె డిమాండ్‌ చేశారు. జనసేన తరఫున తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని మరోసారి పరిశీలించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

First Published:  20 March 2024 11:47 AM IST
Next Story