Telugu Global
Andhra Pradesh

వైఎస్ సునీత పోస్టర్లు అతికించింది వైసీపే.. వరదరాజులు రెడ్డి ఆగ్రహం

అసలు సునీతకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని వరదరాజులు రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఆమెతో పరిచయాలు ఉన్నాయని, రాజకీయాల గురించి మాట్లాడాలని కూడా ఆమె అనుకోదన్నారు.

వైఎస్ సునీత పోస్టర్లు అతికించింది వైసీపే.. వరదరాజులు రెడ్డి ఆగ్రహం
X

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇవాళ ఉదయం ఎక్కడ చూసినా టీడీపీలో చేర‌నున్న‌ వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం.. అంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను పట్టణమంతా అతికించారు. కొంతకాలంగా వైసీపీ నాయకులు సునీత టీడీపీలోకి వెళ్తోందని ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ నాయకుల అండతోనే ఆస్తి కోసం సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి వివేకాను చంపించారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం టీడీపీలో చేరనున్న సునీతకు స్వాగ‌తం అంటూ ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో సునీత పక్కన చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి ఫొటోలు ఉన్నాయి.

అయితే కావాలనే వైసీపీ నాయకులు ఈ పనికి పాల్పడ్డారా..? లేకపోతే నిజంగానే టీడీపీ శ్రేణులు ఈ పోస్టర్లను అతికించారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయమై టీడీపీ సీనియర్ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి స్పందించారు. పట్టణంలో పోస్టర్లు అతికించింది వైసీపీ నాయకులేనని ఆయన ఆరోపించారు. ఇదొక నీచమైన చర్య అని మండిపడ్డారు. ఇలా పోస్టర్లు అతికించడం ద్వారా స్థానిక నాయకుల దురాలోచన ఏంటో తెలియడం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై పరోక్షంగా విమర్శలు చేశారు.

అసలు సునీతకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని వరదరాజులు రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఆమెతో పరిచయాలు ఉన్నాయని, రాజకీయాల గురించి మాట్లాడాలని కూడా ఆమె అనుకోదన్నారు. అటువంటి మహిళపై వాల్ పోస్టర్లు వేశారని, ఈ పనికి పాల్పడ్డవారికి సిగ్గు, లజ్జ లేవా..? అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని ఒకవైపు సునీత న్యాయపోరాటం చేస్తుంటే, మరోవైపు వైసీపీ నాయకులు ఆమె తండ్రికి రెండో భార్య కూడా ఉందని ప్రచారం చేస్తూ చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా చిత్రీకరిస్తున్నారని వరదరాజులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తికోసం వివేకాను కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డే చంపారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. ఇటువంటి ప్రచారం చేసేవారికి సిగ్గు, మానవత్వం లేదా..? అని ఆయన ప్రశ్నించారు.

రాజకీయాలు నీచం అయ్యాయని, ఈ రంగంలోకి రావొద్దని ఇప్పటికే సునీతకు సూచించామని చెప్పారు. ఆమె కూడా తమ అభిప్రాయంతో ఏకీభవించారని వరదరాజులు రెడ్డి చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తోనే రాజకీయాలు ముగిశాయని ఆయన పేర్కొన్నారు. కాగా రాజ‌కీయాల్లో వరదరాజులు రెడ్డి వైఎస్ఆర్‌కు సమకాలికుడు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన వైఎస్ఆర్‌ మరణం తర్వాత టీడీపీలో చేరారు.

First Published:  25 April 2023 5:00 PM IST
Next Story