ఆ వీడియో ఒరిజినల్ కాదని ఏ ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది బాబూ..!
అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ ఎక్స్ పర్టా అని ప్రశ్నించారు. ఎస్పీ మాటలు నిజమైతే, మరి అది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు అసత్యాలా అని లాజిక్ తీశారు.
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారానికి అనంతపురం జిల్లా ఎస్పీ ఫుల్ స్టాప్ పెట్టాలని చూసినా, టీడీపీ వదిలేలా లేదు. ఆ వీడియో ఒరిజినల్ కాదు, ఒరిజినల్ వీడియో బయటకొస్తే అప్పుడేం చేయాలో చూస్తామంటూ ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. అసలు ఎంపీ వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారని ప్రశ్నించారు. అంటే ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ భావిస్తున్నారా అంటూ నిలదీశారు. అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ ఎక్స్ పర్టా అని ప్రశ్నించారు. ఎస్పీ మాటలు నిజమైతే, మరి అది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు అసత్యాలా అని లాజిక్ తీశారు.
జనాలే తేలుస్తారు..?
ఎంపీ మాధవ్ వీడియో ఫేకా..? రియలా..? అనేది ప్రజలే తేలుస్తారని మండిపడ్డారు నారా లోకేష్. అంబటి, అవంతి వాయిస్‌లు కూడా ఫేక్ అని తేల్చకపోయారా అంటూ ఎద్దేవా చేశారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు లోకేష్. మాధవ్ గురించి ఎస్పీకి బాగా తెలుసని, ఇద్దరూ పోలీసులే కదా అని అన్నారు లోకేష్. ఆ వీడియో ఒరిజినల్ కాదంటూ ఏ ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందో ఎస్పీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ వ్యవహారంలో లోకేష్‌ని వైసీపీ తెరపైకి తేవడం విశేషం. గతంలో నారా లోకేష్ అర్థనగ్న ఫొటోలు బయటకొచ్చాయని, వాటి సంగతి తేల్చాలంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. లోకేష్ శృంగారంపై చంద్రబాబు నోరు విప్పాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లోకేష్ ఫొటోలు బయటకొచ్చినప్పుడు, హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గొంతు బయటపడ్డప్పుడు.. వీరంతా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారాయన. మాధవ్ వీడియో నుంచి ఈ వ్యవహారం లోకేష్ పాత ఫొటోల వైపు వెళ్లడం మాత్రం ఈ ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతకీ ఎస్పీ వివరణతో మాధవ్ వీడియో గొడవకి ఫుల్ స్టాప్ పడుతుందా, జనంలో వైసీపీ పలుచన అవుతుందా అనేది వేచి చూడాలి.