అశోక్ గజపతిరాజుకు చెక్ పెడుతున్న సొంత పార్టీ నేత?
అశోక్ గజపతిరాజు కారణంగా గెలవాల్సిన విజయనగరంలో టీడీపీ ఓడిపోయిందని.. ఈసారి కూడా ఆ కుటుంబానికి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని గీత వ్యాఖ్యానిస్తున్నారు.
ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారో.. ఆ నియోజకవర్గాల్లో హడావిడి చేస్తున్నారు. తమ అనుచరులతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం నియోజవకర్గం సీటు కోసం ఇద్దరు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుండటం పార్టీలో విభేదాలు రాజుకునేలా చేసింది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన పూసపాటి అశోక్ గజపతిరాజు.. నాలుగు దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను శాసిస్తున్నారు. ఆ జిల్లాలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా.. రాయల్ ఫ్యామిలీ అనే ముద్రతో విజయాలు సొంతం చేసుకుంటున్నారు. 2014లో లోక్‌సభ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. 2019లో ఆయనకే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఎన్నికల్లో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో విజయనగరం అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని తన కూతురు అదితి విజయలక్ష్మికి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఆమె కూడా ఓటమిని చవి చూశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి నమ్మకంతో పని చేసి, సిట్టింగ్‌గా ఉన్నా కూడా తనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టినందుకు మీసాల గీత చాలా కోపంగా ఉన్నారు.
ఇక ఈసారి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయడానికి అశోక్ గజపతిరాజు రంగం సిద్దం చేసుకుంటున్నారు. తన కూతురు అదితిని లోక్‌సభ స్థానానికి పోటీ చేయించి.. తాను అసెంబ్లీ బరిలో దిగడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విషయం తెలిసి మీసాల గీత ఆగ్రహంతో ఉన్నారు. విజయనగరంలో బలమైన తూర్పు సామాజిక వర్గానికి చెందిన ఆమె.. ఇప్పుడు బీసీ కార్డును ఉపయోగించి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. అశోక్ గజపతిరాజు కారణంగా గెలవాల్సిన విజయనగరంలో టీడీపీ ఓడిపోయిందని.. ఈసారి కూడా ఆ కుటుంబానికి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని గీత వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికే విజయనగరం పరిధిలో ఆమె ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొంతగా కార్యాలయం ఏర్పాటు చేసుకొని.. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అశోక్ గజపతిరాజు పాల్గొనే కార్యక్రమాలకు గీత దూరంగా ఉంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని బీసీ నేతలను ఏకం చేసే పనిలో గీత నిమగ్నమయ్యారు. ఇటీవల బీసీ ఐక్య వేదిక పేరుతో విజయనగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీని వెనుక గీత హస్తం ఉందని అశోక్ గజపతిరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు. వైసీపీ తరపున కూడా బీసీ అభ్యర్థే రంగంలో ఉండబోతున్నారు కాబట్టి.. బలమైన బీసీ సపోర్ట్ ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని గీత కోరుతున్నారు. మొత్తానికి అశోక్ గజపతి కుటుంబం వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరమే ఉందనే చర్చ జరుగుతోంది.