Telugu Global
Andhra Pradesh

ఆనంకు సెగ మొదలైందా?

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వెంకటగిరిలో టికెట్ తనదే అని బల్లగుద్ది చెప్పారు. ఎంతోమంది పార్టీలోకి వస్తుంటారు, పోతుంటారు వాళ్ళందరినీ లెక్కచేయనన్నారు.

ఆనంకు సెగ మొదలైందా?
X

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి అప్పుడే టీడీపీ నుండి సెగ మొదలైనట్లే ఉంది. టీడీపీ నుండి ఆనంకు సెగ తగలటం ఏమిటంటే తమ్ముళ్ళలో బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఏదోరోజు ఆనం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆనం నిత్య అసమ్మతివాదిగా తయారైన కారణంగా నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నేదురుమల్లి రామకుమార్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను నడిపించే బాధ్యత కూడా నేదురుమల్లి మీదే పెట్టారు.

దాంతో ఆనం ఉత్సవ విగ్రహం లాగ మిగిలిపోయారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్యేని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఇవన్నీ ఆనం ముందే ఊహించుంటారనటంలో సందేహంలేదు. అందుకనే ముందుగానే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేట్లు చంద్రబాబుతో ముందే ఆనం ఒప్పందం చేసుకున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు.

సరిగ్గా ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వెంకటగిరిలో టికెట్ తనదే అని బల్లగుద్ది చెప్పారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జినీ తానే, టికెట్టూ తనకే అని తేల్చేశారు. ఎంతోమంది పార్టీలోకి వస్తుంటారు, పోతుంటారు వాళ్ళందరినీ తాను లెక్కచేయనన్నారు. ఆనం పార్టీలోకి రావటం ఎవరికీ ఇష్టంలేదన్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే అని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు స్పష్టంగా ప్రకటించారు. కురుగొండ్ల తాజా ప్రకటనతో ఆనం మద్దతుదారుల్లో టెన్షన్ మొదలైపోయింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వెంకటగిరి కాకపోతే ఆనంకు నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు ఆప్షన్లో ఉన్నాయి. కానీ పై మూడు నియోజకవర్గాల్లో కూడా ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలున్నారు. వీళ్ళంతా టికెట్ల హామీలతోనే పార్టీలో పనిచేసుకుంటున్నారు. కాబట్టి ఆనం పార్టీలోకి వస్తే టికెట్ విషయంలో తమకు ఎక్కడ పోటీవస్తారో అనే టెన్షన్ తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. కాబట్టి అందరు ఆనం రాకను వ్యతిరేకిస్తున్నారట. మరి ఆనం విషయం చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  12 March 2023 5:12 AM GMT
Next Story