Telugu Global
Andhra Pradesh

చాన్నాళ్ల‌కి మోగిన గంట‌..అయ్య‌న్న‌కి చింత‌

విశాఖ‌లో వైసీపీ స‌ర్కారు నిర్వ‌హిస్తున్న ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గంట మోగింది. ఈ స‌మ్మిట్‌ని తాను స్వాగతిస్తున్నాన‌ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

చాన్నాళ్ల‌కి మోగిన గంట‌..అయ్య‌న్న‌కి చింత‌
X

విశాఖ‌లో ఏపీ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న‌ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తెలుగుదేశం పార్టీలో కాక రేపుతోంది. చాలా రోజులుగా టీడీపీకి అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోన్న మాజీ మంత్రి శ్రీనివాస‌రావు గంట మోగ‌డంతో టీడీపీలోనే ప్ర‌కంప‌న‌లు ఆరంభమ‌య్యాయి. ముఖ్యంగా పొలిట్ బ్యూరో స‌భ్యుడు చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు చింతాక్రాంతుడ‌వుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ ఇప్పుడు వ‌చ్చి షో చేస్తున్నార‌ని గంటాపై కోపంగా ఉన్నారు అయ్య‌న్న‌. మొద‌టి నుంచీ గంటా, అయ్య‌న్న మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొనసాగుతోంది. టీడీపీ ఓడిపోయి, గంటా గెలిచినా పార్టీకి దూరం కావ‌డంతో అయ్య‌న్న ఇన్నాళ్లూ హ్యాపీగా విశాఖ‌లో పార్టీని అంతా తానై లీడ్ చేస్తున్నారు.

విశాఖ‌లో వైసీపీ స‌ర్కారు నిర్వ‌హిస్తున్న ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గంట మోగింది. ఈ స‌మ్మిట్‌ని తాను స్వాగతిస్తున్నాన‌ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. పెట్టుబడులు ఎవరు పెట్టినా మంచిదేనంటూనే, నాలుగేళ్ల తరువాత ఇప్పుడే ఎందుకు చేస్తున్నారనేది వైసీపీ ప్రభుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాలన్నారు. గతంలో అనేక పరిశ్రమలు ఏపీ నుంచి ఎందుకు వెళ్లిపోయాయో కూడా ప్రభుత్వం స‌మాధానం చెప్పాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

తెలుగుదేశం క‌ష్టాల్లో ఉంటే, త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు ఇప్పుడు పెద్ద హీరోలా బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌ని అయ్య‌న్న మండిప‌డుతున్నార‌ని స‌మాచారం. ఇన్నాళ్లూ టీడీపీని మోస్తూ ఉన్న తాము నిర్బంధాలు, అరెస్టులు, కేసులతో ఇబ్బందులు ప‌డుతుంటే.. గంటా వ్యూహాత్మ‌క మౌనంతో సేఫ్‌గా ఉన్నార‌ని అయ్య‌న్న ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలుస్తోంది. గంటా తీరుపై ఇటీవ‌ల‌ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ``ఎవడండీ గంటా అంటూ ప్రశ్నించారు. గంటా ఏమైనా పెద్ద నాయకుడా`` అంటూ మండిప‌డ్డారు.

పార్టీ కష్టకాలంలో ఉన్న‌ప్పుడు దాక్కుని, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ టీడీపీకి అనుకూలంగా ప‌రిస్థితి ఉంద‌ని మ‌ళ్లీ వ‌స్తున్నార‌ని గంటాని ఉద్దేశించి త‌న స‌న్నిహితుల వ‌ద్ద అయ్య‌న్న వ్యాఖ్యానించార‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇత‌ర పార్టీల్లో చేరే ప్ర‌య‌త్నాలు ఫెయిల‌వ్వ‌డం, టీడీపీ పుంజుకోవ‌డంతో మ‌ళ్లీ గంట మోగుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గంటా వ‌స్తే తంటా త‌ప్ప‌ద‌ని అన్యాప‌దేశంగా అధిష్టానానికి అయ్య‌న్న హెచ్చ‌రించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

First Published:  3 March 2023 8:20 PM IST
Next Story