Telugu Global
Andhra Pradesh

శాంతి పూజలా..? క్షుద్రపూజలా..? - మాజీమంత్రి దేవినేని పూజల వివాదం

పూజలకు సంబంధించిన సమాచారం ఎవరికీ లేదు. ఎవరికీ తెలియకుండా అలా ప్రైవేట్ స్థలంలో రహస్యంగా నిర్వహించడంపై అందరికీ అనుమానాలు వ్యక్తమయ్యాయి.

శాంతి పూజలా..? క్షుద్రపూజలా..? - మాజీమంత్రి దేవినేని పూజల వివాదం
X

మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు చేసిన పూజలు వివాదాస్పదంగా మారాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి కొన్ని పూజలు జరగడంపై స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అవి క్షుద్ర పూజలేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన స్థలంలో పూజలు జరిగాయంటున్నారు. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. అవి క్షుద్రపూజలేనంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశాయి.

పూజలకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు దేవినేని. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పూజలో పాల్గొన్నట్లు రాసుకొచ్చారు. శ్రీ శ్రీ శ్రీ డా. బాలకృష్ణ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న త్రిదిన త్రికాల విష్ణు దుర్గయాగంలో భాగంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ యార్లగడ్డ వెంకట్రావులతో పాటు పాల్గొన్నట్లు వివరించారు.

అయితే పూజలకు సంబంధించిన సమాచారం ఎవరికీ లేదు. ఎవరికీ తెలియకుండా అలా ప్రైవేట్ స్థలంలో రహస్యంగా నిర్వహించడంపై అందరికీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. యాగ నిర్వాహకులను దీనిపై వివరణ కోరగా దేవినేనికి ఈ పూజలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మరోవైపు స్వయంగా తానే పూజల్లో పాల్గొన్నట్లు దేవినేని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేవినేని పూజల్లో పాల్గొన్నానని చెబుతుంటే నిర్వాహకులు మాత్రం అసలు ఆయనకు సంబంధమే లేదని చెప్పడంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

First Published:  30 Dec 2023 5:42 PM IST
Next Story