ఎస్ఐపై చేయి చేసుకున్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మహిళా కానిస్టేబుళ్లపై దౌర్జన్యం..
విధుల్లో ఉన్న ఎస్ఐపై దౌర్జన్యానికి పాల్పడి.. పోలీసుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కొల్లు రవీంద్ర తీరును పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
విధుల్లో ఉన్న ఎస్ఐపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేయిచేసుకున్నారు. ఆ పార్టీ శ్రేణులు మహిళా కానిస్టేబుళ్లపైనా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం జరిగింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉంది. ఇక్కడ పోలీసుల ముందస్తు అనుమతులతోనే ఎవరైనా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టాలి.
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం మచిలీపట్నంలోని ప్రభుత్వ భూమిలో జరుగుతోందని, దానిని అడ్డుకుంటామని నినదిస్తూ 150 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరారు. దీంతో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని, ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతం కావడం, ప్రజారవాణాకు అంతరాయం కలగడంతో వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. టీడీపీ నేత కొల్లు రవీంద్రకు, ఆ పార్టీ శ్రేణులకు ధర్నా చేసేందుకు అనుమతి లేదని వారు తెలిపారు. దీంతో రెచ్చిపోయిన కొల్లు రవీంద్ర పోలీసులను నెట్టుకుంటూ వారిని దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఎస్ఐ శంకర ప్రసాద్‌పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేయి చేసుకున్నారు. మహిళా కానిస్టేబుళ్లపైనా టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై శంకర ప్రసాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 30 యాక్ట్ ఉల్లంఘనపై కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్రను అరెస్టు చేసి గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా టీడీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ గేట్లు తోసి.. నానా రచ్చ చేశారు. తర్వాత వారిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా, వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
విధుల్లో ఉన్న ఎస్ఐపై దౌర్జన్యానికి పాల్పడి.. పోలీసుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కొల్లు రవీంద్ర తీరును పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అసోసియేట్ ప్రెసిడెంట్ జైపాల్, రాష్ట్ర పోలీసు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మస్తాన్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.