Telugu Global
Andhra Pradesh

అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌, విడుదల

గన్నవరంలో జరిగిన లోకేష్‌ యువగళం సభలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు అంబటి, రోజా, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ను నోటికొచ్చినట్టు తిట్టారు.

అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌, విడుదల
X

టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే విషయంలో హైడ్రామా నడిచింది. హైదరాబాద్‌ నుంచి విశాఖకు విమానంలో రాగానే కృష్ణా జిల్లా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి తీసుకెళ్లారు. దాంతో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశారంటూ టీడీపీ అధినేత నుంచి పార్టీ నాయకుల వరకు మీడియాలో విమర్శలు చేశారు.

ఇటీవల గన్నవరంలో జరిగిన లోకేష్‌ యువగళం సభలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు అంబటి, రోజా, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ను నోటికొచ్చినట్టు తిట్టారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో గాడికి సమాధి కడుతాం, వాడో పెద్ద గజ దొంగ, ఆర్థిక ఉగ్రవాది అంటూ తిట్టారు. ''రేయ్‌ జగన్‌ ఆరోజు కాదురా.. దమ్ముంటే ఈరోజు పాదయాత్ర చేయిరా'' అంటూ దూషించారు. ''ఈ పనికిమాలిన నాకొడుకా మనకు ముఖ్యమంత్రి'' అంటూ నోరు పారేసుకున్నారు. టూరిజం శాఖ మంత్రి రోజాను పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా తాము కోరితే ''నా సొగసు చూడు మామ'' అంటోంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేకప్ తీస్తే పగలే దడుచుకుంటాం అంటూ కించపరిచారు.

ఈ మాటలపై మాజీ మంత్రి పేర్ని నాని ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఇది వరకే ఫిర్యాదు చేశారు. దాంతో అయ్యన్నపాత్రుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడితో పాటు బుద్దా వెంకన్నపైనా పేర్నినాని ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలోనూ అయ్యన్నపాత్రుడిని విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత యలమంచిలి వద్ద అయ్యన్నపాత్రుడికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. అప్పటికే చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అయ్యన్న అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. జగన్‌ మాటలు విని పోలీసులు హద్దులు మీరితే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. జగన్‌ నియంత పాలనకు అయ్యన్న అరెస్ట్‌ నిదర్శనమన్నారు.

*

First Published:  1 Sept 2023 12:57 PM IST
Next Story