రుషికొండ భవనాలను ఏం చేస్తారంటే..?
రుషికొండ రాజ మహల్ రహస్యం ఇవాళ తెలిసిందని, ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందని అన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
వైసీపీ గెలిచి ఉంటే, విశాఖలో రెండోసారి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటే.. ఈ పాటికి రుషికొండ భవనాలు పాలనలో కీలకంగా మారేవి. కానీ కూటమి విజయంతో రుషికొండ భవనాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రజా వేదికను అనుమతి లేని కట్టడంగా ప్రకటించి అప్పటి ప్రభుత్వం కూల్చివేసింది. రుషికొండ నిర్మాణాలకు కూడా అనుమతి లేదంటూ ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మరి వీటిని సీఎం చంద్రబాబు ఏం చేస్తారు..? ఎలా వినియోగించుకుంటారు..? అసలు వినియోగిస్తారా, లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా రుషికొండ భవనాలను పరిశీలించారు.
స్థానిక నాయకులతో కలిసి రుషికొండ భవనంలోకి వెళ్లడం జరిగింది. ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్, ఫర్నీచర్ – సుమారు రూ. 500 కోట్లతో నిర్మాణం చేపట్టారు – సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగిస్తారని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారు – రుషికొండ భవనం నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారు – ప్రభుత్వ… pic.twitter.com/zTgU4L6Mwj
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) June 16, 2024
రుషికొండ రాజ మహల్ రహస్యం ఇవాళ తెలిసిందని, ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందని అన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు ఇక్కడికి వస్తే అడ్డుకున్నారని, కేసులు పెట్టారని గుర్తు చేసిన ఆయన, దేశంలో ఇంత వివాదాస్పద భవనాలు ఎక్కడా కట్టలేదన్నారు. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారని చెప్పారు. లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చి రాజ భవనాలు నిర్మించారని, వీటి నిర్మాణంకోసం న్యాయస్థానానికి కూడా తప్పుడు సమాచారం అందించారన్నారు. సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాలను మించి ప్రజా ధనంతో వీటిని కట్టారని ఆరోపించారు గంటా.
చంద్రబాబుని అడిగి..
రుషికొండపై మొత్తం 61ఎకరాల్లో 7 బ్లాకులు నిర్మించారని, వీటిని ఏం చేయాలోముఖ్యమంత్రి చంద్రబాబుని అడిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు గంటా శ్రీనివాసరావు. విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పినా, ప్రజలు నమ్మలేదని, విశాఖలో కూడా కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీలు వచ్చాయని చెప్పారు. మరి చంద్రబాబు ఈ భవనాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వీటిని తిరిగి టూరిజం భవనాలుగా ఉపయోగిస్తారా, లేక పాలన కోసం వాడుకుంటారా అనేది వేచి చూడాలి.