Telugu Global
Andhra Pradesh

జ‌న‌సేన‌, టీడీపీ మరో ర‌గ‌డ‌.. ఈసారి జ‌గ్గంపేట‌లో..

నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఆత్మీయ స‌మావేశాల్లో రెండు పార్టీల నాయ‌కులు జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు. మొన్న పిఠాపురంలో ర‌గ‌డ మ‌ర్చిపోక‌ముందే నిన్న జ‌గ్గంపేటలో మ‌రో రచ్చ జ‌రిగింది.

జ‌న‌సేన‌, టీడీపీ మరో ర‌గ‌డ‌.. ఈసారి జ‌గ్గంపేట‌లో..
X

జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసే పోటీ చేస్తాయ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించేశారు. పొత్తును ముందుకు తీసుకెళ్ల‌డానికి రాష్ట్రస్థాయిలో స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశాలు నిర్వ‌హించారు. త‌ర్వాత జిల్లా, నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిల్లో ఆత్మీయ స‌మావేశాల పేరిట ఇరు పార్టీల నేత‌ల‌ను దగ్గ‌ర చేసే ప్ర‌య‌త్నాలను రెండు పార్టీల నాయ‌క‌త్వాలు ప్రారంభించాయి. కానీ, క్షేత్ర‌స్థాయిలో స‌న్నివేశం వేరుగా ఉంది. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఆత్మీయ స‌మావేశాల్లో రెండు పార్టీల నాయ‌కులు జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు. మొన్న పిఠాపురంలో ర‌గ‌డ మ‌ర్చిపోక‌ముందే నిన్న జ‌గ్గంపేటలో మ‌రో రచ్చ జ‌రిగింది.

పాత గొడ‌వ‌ల‌తో ప‌ట్టుద‌ల‌

గండేపల్లి మండలం జడ్. రాగంపేటలో గురువారం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించాయి. కొన్ని రోజుల క్రితం గోకవరం మండల జనసేన అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నాన్ని టీడీపీకి చెందిన‌వారు కొట్ట‌డంతో కాలు విరిగింద‌ని, దానికి జ్యోతుల నెహ్రూ వ‌చ్చి సమాధానం చెప్పాలని సమావేశానికి ముందు జ‌న‌సేన నాయ‌కులు గేటు బయట నిరసన తెలిపారు. నెహ్రూ వచ్చి సమావేశం అయిన తర్వాత మాట్లాడుకుని పరిష్కరించుకుందాం అని, లోపలికి రావాలని జనసేన నాయకులను కోరినా వారు పట్టించుకోలేదు. ఎట్ట‌కేల‌కు వెళ్లినా.. అదే ఘ‌ట‌న గురించి ప‌దే ప‌దే మాట్లాడ‌టంతో నెహ్రూ కుమారుడు, కాకినాడ జిల్లా టీటీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆగ్రహానికి గురై జనసేన నాయకులను నెట్టారు. జనసేన నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మధ్య తోపులాట జర‌గ‌డంతో స‌మావేశం ర‌సాభాస‌గా మారింది.

జ‌న‌సేన‌కు టికెటిచ్చినా గెలిపిద్దామ‌నుకున్నా.. ఇప్పుడు నేనే దిగుతా

జ్యోతుల నెహ్రూ ఈ గొడ‌వ త‌ర్వాత మాట్లాడుతూ 45 ఏళ్ల త‌న‌ రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు చూడ‌లేద‌న్నారు. కొందరు జనసేన నాయకులు కావాలని ఈ గొడవ సృష్టించి, రెచ్చగొడుతున్నారన్నారు. జనసేన - టీడీపీ పొత్తును మనస్ఫూర్తిగా స్వాగతించానని, జగ్గంపేట టికెట్ జనసేనకు ఇచ్చినా సరే త‌న‌ భుజాల‌పై మోసి గెలిపిద్దామ‌నుకున్నాన‌ని, కానీ, పాటంశెట్టి సూర్యచంద్రకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హ‌క‌రించేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా తానే నిలబడతానని సభాముఖంగా తేల్చిచెప్పారు.

First Published:  17 Nov 2023 10:50 AM IST
Next Story