కూటమి మేనిఫెస్టో రిలీజ్.. బయటపడ్డ లుకలుకలు
మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలోనూ ఆ బ్రోచర్‌ను పట్టుకునేందుకు బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఇష్ట పడలేదు. ఓ కార్యకర్త బ్రోచర్‌ను ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు.
ఏపీలో టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేనిఫెస్టో విడుదల కోసం ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ఫ్లెక్సీలో కేవలం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ఫొటోలు మాత్రమే ఉండడం.. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ఏ ఒక్క బీజేపీ నేత ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మేనిఫెస్టో విడుదల ఆలస్యమైందనే ప్రచారం జరుగుతోంది.
మొదట 12 గంటల 30 నిమిషాలకు మేనిఫెస్టో విడుదల చేయాలని కూటమి నేతలు ప్లాన్ చేశారు. తర్వాత బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్‌తో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఫ్లెక్సీలో, మేనిఫెస్టో బ్రోచర్‌పై బీజేపీ నేతల ఫొటోలు లేకపోవడంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ విబేధాల కారణంగానే అనుకున్న సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా మేనిఫెస్టో రిలీజ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ పురందేశ్వరి కూడా దూరంగా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా ఈ కార్యక్రమంలో బీజేపీ అంటిముట్టనట్లుగా వ్యవహరించింది.
మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలోనూ ఆ బ్రోచర్‌ను పట్టుకునేందుకు బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఇష్ట పడలేదు. ఓ కార్యకర్త బ్రోచర్‌ను ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. దీంతో కూటమిలో లుకలుకలున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఇక చివర్లో మాట్లాడిన సిద్ధార్థ్ నాథ్ సింగ్.. ఈ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని, బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ.. ఈ మేనిఫెస్టో టీడీపీ-జనసేనలదేనని ఆయన చెప్పడం కొసమెరుపు.